మిల్లుల్లో వడ్లు మాయం!.. సర్కారు మిల్లింగ్‌‌కు ఇచ్చిన ధాన్యాన్ని బయట అమ్ముకున్న మిల్లర్లు

మిల్లుల్లో వడ్లు మాయం!.. సర్కారు మిల్లింగ్‌‌కు ఇచ్చిన ధాన్యాన్ని బయట అమ్ముకున్న మిల్లర్లు
  • గడువు పెంచుతూ పోతున్నా సీఎంఆర్ డెలివరీ చేయకపోవడానికి కారణమిదే!
  • కొత్త ప్రభుత్వం ఆదేశాలతో కదిలిన సివిల్ సప్లయ్స్, రెవెన్యూ ఆఫీసర్లు
  • రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
  • ఆర్ఆర్ యాక్ట్ కింద నిందితులపై కేసులు, అరెస్టులు

వెలుగు, నెట్‌‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా నిరుడు వానాకాలం, యాసంగి సీజన్లలో మరాడించేందుకు ఇచ్చిన వడ్లను మెజారిటీ రైస్​ మిల్లర్లు మాయం చేశారు. సివిల్ సప్లయ్స్‌‌ శాఖకు సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద ఇవ్వకుండా బయట అమ్ముకున్నారు. ప్రస్తుతం మార్కెట్‌‌లో వడ్లు లేకపోవడంతో స్టాక్ నిల్వలు చూపలేక చేతులెత్తేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీ రావడంతోనే సీఎంఆర్‌‌‌‌పై సీరియస్‌‌గా దృష్టి పెట్టింది. ఇప్పటికి మూడుసార్లు గడువు విధించినా బియ్యం డెలివరీ ఇవ్వని మిల్లర్లపై కొరడా ఝులిపిస్తున్నది. పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి ఆదేశాలతో సివిల్ సప్లయ్స్ విజిలెన్స్ విభాగం, రెవెన్యూ ఆఫీసర్లు రంగంలోకి​దిగి మిల్లుల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు.

సీఎంఆర్ కోసం ఇచ్చిన వడ్లను బయట అమ్ముకున్నట్లు తేలడంతో మెదక్ జిల్లా నర్సాపూర్‌‌‌‌కు చెందిన రైస్​మిల్లర్ పైడి శ్రీధర్ గుప్తాపై సివిల్ సప్లయ్స్‌‌ ఆఫీసర్లు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించారు. శ్రీధర్ గుప్తాకు చెందిన శ్రీపాద, శ్రీ వేంకటేశ్వర, శివ సాయి రైస్ మిల్లుల్లో 17,777 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. రూ.57 కోట్లు వెంటనే చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. కానీ శ్రీధర్ రూ.10 కోట్లు మాత్రమే చెల్లించాడు. దీంతో ఆర్ఆర్ యాక్ట్ కింద శ్రీధర్ గుప్తాకు చెందిన రెండు కార్లు, ఇతర విలువైన వస్తువులు సీజ్ చేశారు. సివిల్ సప్లయ్స్ అధికారుల ఫిర్యాదుతో శ్రీధర్ గుప్తాను  రెండు రోజుల కింద పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో మిల్లర్ల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నిందితులపై ఆఫీసర్లు రెవెన్యూ రికవరీ యాక్ట్​(ఆర్ఆర్ యాక్ట్) ప్రయోగిస్తున్నారు. ఆస్తులను సీజ్ చేసి అరెస్ట్​చేసి, రిమాండ్‌‌కు తరలిస్తున్నారు.

లక్షల టన్నులు పెండింగ్

2022–23 వానాకాలానికి సంబంధించి 6 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లర్లు ఇంకా అప్పగించలేదు. ఇక యాసంగిలో రైతుల నుంచి సేకరించిన 66.84 లక్షల టన్నుల వడ్లకు గాను 45.07 లక్షల టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ కింద ఇవ్వాల్సి ఉంది. కానీ కేవలం 10.27 లక్షల టన్నులే ఎఫ్‌‌సీఐకి అప్పగించారు. అంటే ఇంకా 77 శాతం బియ్యాన్ని మిల్లర్లు ఇవ్వాలి. ఇందుకోసం ఇప్పటికే రెండుసార్లు గడువు ఇచ్చిన సివిల్​సప్లయ్స్ శాఖ.. డెడ్​లైన్​ను గతేడాది డిసెంబర్​31కి పొడిగించింది. అయినప్పటికీ మిల్లర్ల నుంచి స్పందన కనిపించకపోవడంతో ఆఫీసర్లు తనిఖీలు ముమ్మరం చేశారు. మిల్లుల్లో ఉండాల్సిన సుమారు 50 లక్షల టన్నుల వడ్ల లెక్కలు తీసే పనిలో పడ్డారు. ఈ క్రమంలో చాలా మిల్లుల్లో వడ్లు మాయమైనట్లు గుర్తిస్తున్నారు. కొన్నిచోట్ల సీఎంఆర్​ కోసం ఇచ్చిన వడ్లను అమ్ముకున్న మిల్లర్లు.. అలా వచ్చిన డబ్బును ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుసుకొని అవాక్కవుతున్నారు. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని ఇద్దరు మిల్లర్లు బి య్యాన్ని అమ్మగా వచ్చిన డబ్బును రియల్ ఎస్టేట్ బిజి నెస్​లో పెట్టినట్లు ప్రాథమికంగా తేల్చారు.

అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి

  • కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలం గూరులోని ఓ రైస్ మిల్లుకు 38,893 క్వింటాళ్ల ధాన్యం కేటాయించగా.. 23,504 క్వింటాళ్లు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. రూ.7,18,26,515 జరిమానా చెల్లించాలని నోటీసులిచ్చారు. అయినా స్పందించకపోవడంతో మిల్లు నిర్వాహకుడు అనిల్ పై కేసు నమోదు చేసి ఈ నెల 6న అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
  • సూర్యాపేట జిల్లాలో వడ్లను పక్కదారి పట్టించిన 12 మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. కోదాడకు చెందిన ఉశస్విని రైస్ మిల్ లో రూ.60 కోట్ల ధాన్యాన్ని బయట అమ్ముకున్నట్లు గుర్తించారు.
  • నిర్మల్ జిల్లాలోని రైస్ మిల్లుల్లో రెవెన్యూ ఆఫీసర్లు తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రతి మిల్లులో స్టాక్​ను పరిశీలిస్తున్నారు. భైంసా మండలం దేగామలోని రాజ రాజేశ్వర రైస్ మిల్లులో యాసంగికి సంబం ధించి 3,856 మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పట్టించడంతో కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
  • సీఎంఆర్ అప్పగించకపోవడంతో జోగులాంబ గద్వాల జిల్లాలో 3 రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు పెట్టారు. బియ్యం ఇవ్వని మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు పెట్టి రికవరీ చేయాలని ఇటీవల మం త్రి జూపల్లి ఆదేశించడంతో తనిఖీలు చేశారు.
  • వనపర్తిలో 50 శాతం మిల్లర్లు మాత్రమే సీఎంఆర్ ఇచ్చారు. 5 మిల్లుల్లో స్టాక్ లో భారీ తేడాలు ఉన్నట్టు గుర్తించిన ఆఫీసర్లు ఆయా మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. ఈ నెల 31 తర్వాత బియ్యం ఇవ్వని మిల్లర్లపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.
  • కామారెడ్డి జిల్లాలో 39 ​మిల్లులు సీఎంఆర్ టార్గెట్ పూర్తి చేయలేదు.  వారం రోజులుగా ఆఫీసర్లు మిల్లు లను తనిఖీలు చేయగా.. స్టాక్​లో భారీగా తేడాలున్నట్లు బయటపడుతున్నది.
  • సిద్దిపేట జిల్లాలో  20  మిల్లులు వడ్లను పక్కదారి ప ట్టించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో  నోటీసు లు ఇచ్చిన ఆఫీసర్లు చర్యలకు సిద్ధమవుతున్నారు.