ఉన్న సీట్లను కాపాడుకుంటే చాలు.. పార్టీ విస్తరణను పక్కన పెట్టిన మజ్లిస్

ఉన్న సీట్లను కాపాడుకుంటే చాలు.. పార్టీ విస్తరణను పక్కన పెట్టిన మజ్లిస్
  • ఉన్న సీట్లను కాపాడుకుంటే చాలు
  • పార్టీ విస్తరణను పక్కన పెట్టిన మజ్లిస్
  • మూడు సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్చే యోచన 
  • తాజా పరిస్థితుల నేపథ్యంలో సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవడంపైనే ఫోకస్

హైదరాబాద్‌‌, వెలుగు: మజ్లిస్‌‌ పార్టీ ఇప్పటి వరకు పాతబస్తీకే పరిమితమవుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తూ వస్తున్న ఆ పార్టీ రాష్ట్రంలో ఈయేడు పార్టీని విస్తరించాలని భావించింది. కానీ తాజాగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ విస్తరణను పక్కన పెట్టి ఇప్పుడున్న సీట్లనే గెలుచుకుని మళ్లీ సత్తా చాటాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా సమస్య ఉన్న సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్చి కొత్త క్యాండిడేట్‌‌లను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అలాగే ఈ ఎన్నికల్లో సీనియర్‌‌లను పక్కన పెట్టి యూత్‌‌కు ప్రాధాన్యం ఇవ్వాలనీ భావిస్తోంది.   

నాంపల్లి, చార్మినార్​, యాకత్​పురాలో.. 

ప్రస్తుతం మజ్లిస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాల్లోని మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నాంపల్లి, చార్మినార్‌‌, యాకత్‌‌పుర సెగ్మెంట్లలో అభ్యర్థులను మార్చేందుకు కసరత్తు చేస్తోంది. వయోభారంతో యాకత్‌‌పుర సిట్టింగ్‌‌ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. నాంపల్లి సిట్టింగ్‌‌ ఎమ్మెల్యే జాఫర్‌‌ హుస్సేన్‌‌ ను ఇక్కడి నుంచి మార్చి యాకత్‌‌పుర నుంచి బరిలో దించాలని పార్టీ యోచిస్తోంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చార్మినార్‌‌ సిట్టింగ్‌‌ ఎమ్మెల్యే ముంతాజ్‌‌ఖాన్‌‌ ను అక్కడి నుంచి మార్చనున్నట్లు సమాచారం. 

చార్మినార్‌‌ నుంచి అక్బరుద్దీన్‌‌ ఒవైసీ కొడుకు నూరుద్దీన్ ఒవైసీని రంగంలోకి దించాలని, ముంతాజ్‌‌ఖాన్‌‌ను నాంపల్లికి మార్చాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అయితే దీనిపై ముంతాజ్‌‌ ఖాన్‌‌ అభ్యంతర వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. చార్మినార్‌‌ నుంచి తనకు లేకపోతే తన కొడుకుకే టికెట్ ఇవ్వాలని ముంతాజ్‌‌ఖాన్‌‌ డిమాండ్ చేస్తున్నట్లు దారుసలాం వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవసరమైతే నాంపల్లి నుంచి మాజీ మేయర్‌‌ మాజీద్‌‌ హుస్సేన్‌‌ను సైతం బరిలో దింపేందుకు మజ్లిస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  

అనూహ్యంగా పావులు కదిపి..

రాష్ట్రంలో ఇప్పుడున్న ఏడు ఎమ్మెల్యే సీట్లకు అదనంగా మరో నాలుగైదు సీట్లను గెలుచుకునేందుకు ప్రయత్నించాలని మజ్లిస్‌‌ పార్టీ ముందుగా యోచించింది. అయితే, కొన్నాళ్లక్రితం వరకూ బీఆర్‌‌ఎస్‌‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అంటూ ప్రచారం జరిగినా.. ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఎన్నికల టైమ్‌‌ దగ్గరపడుతున్నకొద్దీ కాంగ్రెస్ బలం పెరుగుతోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీని విస్తిరించే కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఉన్న స్థానాలను కాపాడుకోవడమే మేలు అని మజ్లిస్ భావిస్తోంది. ఇప్పుడున్నవాటిలోనే ఒక సీటును కోల్పోయే ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో అనూహ్యంగా పావులు కదిపి తిరిగి ఉన్న సీట్లను దక్కించుకునే పనిలో పడినట్లు సమాచారం.