
హరారే: జింబాబ్వేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి హైవేపై ప్రయాణిస్తున్న మిని బస్ అదుపు తప్పి ట్రక్కును ఢీ కొట్టింది. బులావాయో–బిట్ బ్రిడ్జ్ నగరాలను కలుపుతున్న జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 22 మంది మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని పోలీసులు హుటాహుటిన దవాఖానాకు తరలించారు. కొన్నేళ్లుగా జింబాబ్వే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది.
పెరిగిన ధరల కారణంగా నిత్యావసరాలను కొనుగోలు చేయడానికీ జనం భయపడుతున్నారు. దీంతో సరిహద్దులు దాటి సౌతాఫ్రికాలో అడుగుపెడుతున్నారు. అక్కడి సిటీలో అవసరమైన వస్తువులు కొనుక్కుని తిరిగొస్తున్నారు. దీనిని అవకాశంగా మలుచుకున్న డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్నారు. మితిమిరీన వేగంతో ప్రయాణిస్తున్నారు. ఫలితంగా జింబాబ్వే జాతీయ రహదారులపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.