- అత్యవసర సాయం కింద రూ. లక్ష చెక్కు అందజేత
- బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు
మెహిదీపట్నం, వెలుగు: హయత్నగర్ శివగంగా కాలనీలో కుక్కల దాడిలో గాయపడ్డ మూగ బాలుడిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బుధవారం నీలోఫర్ హాస్పిటల్లో పరామర్శించారు. బాలుడి తల్లిదండ్రులు తిరుపతి రావు, చంద్రకళ దంపతులకు అత్యవసర సాయం కింద రూ. లక్ష చెక్ అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు, బధిరుల స్పెషల్ స్కూల్లో అడ్మిషన్, పూర్తి చదువు, దివ్యాంగ గుర్తింపు కార్డు, పింఛను, పునరావాసం సహా అన్ని సహాయాలూ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇక ముందు ఇలాంటి ఘటనలు జరిగితే జిల్లా దివ్యాంగ సంక్షేమ అధికారులు ఆలస్యం చేయకుండా వెంటనే సహాయం అందించాలని ఆదేశించారు.అంతకుముందు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా రెడ్డి కూడా బాలుడిని పరామర్శించారు.
మంత్రిని ప్రశ్నించిన రోగుల సహాయకులు
మంత్రి మీడియాతో మాట్లాడుతుండగా.. నిలోఫర్ హాస్పిటల్లో వసతులపై కొందరు ప్రశ్నించారు. తన కొడుకుకు న్యుమోనియా రావడంతో 15 రోజుల కింద వైద్యం కోసం వచ్చినట్లు తెలి పారు. అయితే సమయానికి తమ శిశువుకు వెంటిలేటర్ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడ్డామని ఆమనగల్ ప్రాంతానికి చెందిన నరేశ్ తెలిపారు. చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన పాండు తన భార్య నాలుగు రోజులుగా ఆసుపత్రిలో ఉందని డాక్టర్లు సరైన వైద్యం అందించడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సూపరింటెండెంట్ విజయ్ కుమార్ ను మంత్రి పిలిచి రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. ఆసుపత్రిలో వసతులు చాలా బాగా ఉన్నాయని, రోగికి అవసరం ఉంటేనే వెంటిలేటర్ పెడతామని, అవసరం లేకుంటే వెంటిలేటర్ పెట్టమని తెలిపారు.
