అక్టోబర్ 20లోపు బీఏఎస్ స్టూడెంట్ల ఫీజులు చెల్లిస్తం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

అక్టోబర్ 20లోపు బీఏఎస్ స్టూడెంట్ల ఫీజులు చెల్లిస్తం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో బెస్ట్​ అవైలేబుల్​స్కీం (బీఏఎస్​) కింద ప్రైవేట్​స్కూళ్లల్లో చదువుతున్న స్టూడెంట్ల ఫీజులను ఈ నెల 20 లోపు చెల్లిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్​​ప్రకటించారు. బీఏఎస్​స్కీంలోని పేద విద్యార్థుల పట్ల స్కూల్​యాజమాన్యాలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. శనివారం ఆయన సెక్రటేరియెట్ లో మీడియాతో మాట్లాడారు. " గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యతోపాటు సంక్షేమాన్ని  పూర్తిగా విస్మరించారు. 

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రూ.464 కోట్ల భారం పడినా.. విద్యార్థుల మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచం. దీంతో గురుకులాల్లో అడ్మిషన్లు పెరిగాయి. ప్రస్తుతం 3.27 లక్షల మందికిపైగా విద్యార్థులు గురుకులాల్లో చదువుకుంటున్నారు. కొత్త భవన నిర్మాణాలు, విద్యార్థుల భోజనం, వసతి, పరిశుభ్రత, ఆరోగ్యంపై రేవంత్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. గురుకులాలలో చదువుకున్న 33 మంది గ్రూప్​–1, 145 మంది గ్రూప్​–4 ఉద్యోగులుగా, 123 మంది ప్రభుత్వ టీచర్లుగా ఎంపికయ్యారు. 

హాస్టళ్లలో ఆహార నాణ్యత, మెడికల్ చెకప్‌‌లు, శానిటేషన్‌‌పై ప్రత్యేక పర్యవేక్షణ జరిపి, ప్రతి వారం ఉన్నతాధికారులు ఇన్‌‌స్పెక్షన్‌‌లు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని డిజిటల్‌‌గా మానిటర్ చేసే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటవుతున్నది.  విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సొసైటీ స్థాయిలో పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. కలెక్టర్లు, ఆఫీసర్ల సమన్వయంతో సొసైటీ స్థాయిలో సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తున్నది" అని పేర్కొన్నారు.