V6 News

గ్లోబల్ సమిట్ సక్సెస్‌‌తో బావ బామ్మర్దుల్లో ఈర్ష్య : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

గ్లోబల్ సమిట్ సక్సెస్‌‌తో బావ బామ్మర్దుల్లో ఈర్ష్య : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
  • అందుకే హరీశ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతుండు: మంత్రి అడ్లూరి 

హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ సమిట్ సక్సెస్‌‌తో బావ బామ్మర్దులు హరీశ్‌‌ రావు, కేటీఆర్‌‌‌‌లో ఈర్ష్య మొదలైందని, అందుకే హరీశ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. బుధవారం సీఎల్పీలో మీడియాతో ఆయన  మాట్లాడారు. మరోసారి హరీశ్‌‌ రావు నోరు జారితే బాగుండదని.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు. 

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్లోబల్ సమిట్ సక్సెస్ అయిందని, ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రముఖ పెట్టుబడుదారులు తెలంగాణపై నమ్మకం ఉంచడంతో రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందన్నారు. సీఎం రేవంత్‌‌కు విజన్ ఉందని, కానీ బీఆర్ఎస్‌‌కు ఉన్న విజన్ మాత్రం దోచుకోవడం, దాచుకోవడం, పేదల భూములను ఆక్రమించుకోవడమేనని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక హైదరాబాద్ వస్తే.. పేదలను బందీలుగా చేసి, డ్రైనేజీలపై రెడ్ కార్పెట్‌‌లు వేసిన నేతలు.. ఇప్పుడు గ్లోబల్ సమిట్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. 

ఇప్పటికైనా ప్రభుత్వంపై విమర్శలు చేయడం మాని, మీ ఇంట్లో జరుగుతున్న గొడవలపై దృష్టి పెట్టాలని హరీశ్‌‌, కేటీఆర్‌‌‌‌కు సూచించారు. పదేండ్ల మీ పాలనలో రాష్ట్రానికొచ్చిన సంస్థలు, పెట్టుబడులెన్ని? కాంగ్రెస్‌‌ రెండేండ్ల పాలనలో వచ్చిన కంపెనీలు, పెట్టుబడులపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు తాము సిద్ధమని, దీనిపై చర్చకు హరీశ్‌‌ రావు సిద్ధమా అని అడ్లూరి సవాల్ చేశారు.