ఎయిర్ పోర్టులో తప్పుడు అడ్రస్‌లు ఇస్తే కేసులు పెట్టండి..అధికారులకు మంత్రి దామోదర ఆదేశం

ఎయిర్ పోర్టులో తప్పుడు అడ్రస్‌లు ఇస్తే కేసులు పెట్టండి..అధికారులకు మంత్రి దామోదర ఆదేశం
  • ఎబోలా ముప్పుపై సెక్రటేరియెట్‌లో రివ్యూ

హైదరాబాద్, వెలుగు: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఎయిర్‌‌ పోర్టులో తప్పుడు వివరాలిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్రంలో చేపట్టిన ముందస్తు జాగ్రత్తలపై సోమవారం ఆయన సెక్రటేరియెట్‌‌ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

విదేశాల నుంచి వచ్చే కొందరు ప్రయాణికులు ఎయిర్‌‌ పోర్టులో తమ ఫోన్ నంబర్లు, చిరునామాలు తప్పుగా ఇస్తున్నారని, దీనివల్ల వారిని ట్రాక్ చేయడం కష్టమవుతోందని మంత్రి దృష్టికి అధికారులు  తీసుకెళ్లారు. దీనిపై మంత్రి దామోదర తీవ్రంగా స్పందించారు. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారు వాస్తవాలను దాచిపెట్టినా, తప్పుడు సమాచారం ఇచ్చినా వారిపై ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ సహా ఇతర చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని పోలీసు, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.

ఈ విషయాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులోనే ప్రయాణికులకు స్పష్టంగా వివరించాలని సూచించారు. విదేశీయులకు భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా.. ఫ్రెంచ్, అరబిక్, స్వాహిలి వంటి భాషల్లో మాట్లాడగలిగే నిపుణుల కోసం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాంటాక్ట్ ట్రేసింగ్‌‌ ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, ఎయిర్‌‌ పోర్ట్ అథారిటీ, పోలీస్ శాఖల మధ్య సమన్వయం పెంచాలని స్పష్టం చేశారు.

రెండోసారి నెగెటివ్ వస్తేనే డిశ్చార్జ్ చేస్తం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్, సర్వైలెన్స్ వ్యవస్థలను మరింత బలోపేతం చేశామని మంత్రికి అధికారులు  తెలిపారు. ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిని 21 రోజుల పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అనుమానిత లక్షణాలు ఉన్న ఇద్దరిని ఇప్పటికే గాంధీ హాస్పిటల్ ఐసోలేషన్‌‌ లో ఉంచినట్లు వెల్లడించారు. వారి శాంపిల్స్‌‌ ను పుణెలోని ఎన్‌‌ఐవీకి పంపగా తొలి పరీక్షలో నెగిటివ్ వచ్చిందని, ఐసీఎంఆర్ సూచనల మేరకు రెండోసారి కూడా శాంపిల్స్ సేకరించి పంపినట్లు వివరించారు.

రెండో టెస్టులోనూ నెగిటివ్ వస్తేనే వారిని డిశ్చార్జ్ చేస్తామన్నారు. టెస్టుల నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించకూడదని, సీసీఎంబీలో అందుబాటులో ఉన్న ఎబోలా టెస్టింగ్ కిట్ల ద్వారా శాంపిల్స్ రాగానే ఫలితాలు ఇవ్వాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందకుండా కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని మంత్రి దామోదర కోరారు. ఈ సమావేశంలో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చొంగ్తు, జీహెచ్‌‌ఎంసీ అడిషనల్ కమిషనర్ సంతోష్, సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి, హైదరాబాద్ డీఎంహెచ్‌‌వో డాక్టర్ వెంకటి ఇఫ్లూ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

హాస్పిటళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ), డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్​ఫ్యామిలీ వెల్ఫేర్​(డీపీహెచ్) పరిధిలో చేపట్టిన హాస్పిటల్స్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. సోమవారం సెక్రటేరియట్ లో తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీజీఎంఎస్ఐడీసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో మంత్రి చర్చించారు.

ఈ సమావేశంలో క్యూర్ ఏరియాలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఏర్పాటుపై సమీక్షించారు. 70 శాతం నిర్మాణ పనులు పూర్తి అయిన టీచింగ్ హాస్పిటల్స్ లో ఎక్విప్​మెంట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. టీవీవీపీ పరిధిలో చేపట్టిన అన్ని నిర్మాణ పనులను ఏడాది లోపు పూర్తి చేయాలని.. డీఎంఈ పరిధిలో నిర్మాణం అవుతున్న టీచింగ్ హాస్పిటల్స్ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

అలాగే, మూడో విడతలో ప్రారంభమైన టీచింగ్ హాస్పిటల్స్ నిర్మాణ పనులు, భూసేకరణపై చర్చించారు. నర్సింగ్ కాలేజీలు, హాస్టల్స్, టీచింగ్ హాస్పిటల్స్ నిర్మాణ పనులు, ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్, మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, క్రిటికల్ కేర్ బ్లాక్స్ ల నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు.