- రీల్స్, మీమ్స్, లైవ్ లొకేషన్లతో నిరసనలు వైరల్
- పాతకాలపు వాట్సాప్ ఫార్వర్డ్‌లు, టీవీ చర్చలకు నో
న్యూఢిల్లీ: నీట్ లీకేజీపై దేశ యువత చేసిన పోరాటం సక్సెస్ అయింది. ఎట్టకేలకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రిజైన్ చేశారు. అయితే, యువత చేసిన పోరాటం తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేవలం చేతిలో ఉన్న సెల్ ఫోన్‌ని ఆయుధంగా మార్చుకుని యువత చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం చేసింది.
ఎలాంటి రాజకీయ నాయకులు, అధికారిక బ్యానర్లు లేకుండానే కేవలం సోషల్ మీడియాను ఉపయోగించి ప్రభుత్వంపై చేసిన పోరాటం ప్రశంసలు అందుకుంటున్నది. సామాన్యులు సైతం ప్రభుత్వాన్ని ఎంత గట్టిగా ప్రశ్నించగలరో ఈ డిజిటల్ పోరాటం నిరూపించింది. రెండు నెలల క్రితం కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కేవలం సోషల్ మీడియాలో సెటైరికల్ గా పుట్టింది.
ఇప్పుడు పేపర్ లీకేజీ అంశంపై ఏకంగా దేశ ప్రధానే జోక్యం చేసుకునేంత శక్తిమంతంగా ఎదిగింది. నీట్ పేపర్ లీక్ దీనికి తక్షణ కారణమైనప్పటికీ.. ప్రభుత్వ వ్యవస్థల తీరుపై యువతలో పేరుకుపోయిన అసంతృప్తి జంతర్ మంతర్ నిరసనలకు అసలు సిసలు కారణంగా కనిపిస్తున్నది. ఏ రాజకీయ పార్టీల పిలుపు లేదు, పెద్ద పెద్ద సభలు లేవు.. కేవలం స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, మీమ్స్, లైవ్ లొకేషన్లు షేర్ చేస్తూ లక్షలాది మంది విద్యార్థులు, మధ్యతరగతి యువత సీజేపీ ఆధ్వర్యంలో ఒక్కటయ్యారు.
ఒక మొబైల్ ఉంటే చాలు ఎక్కడి నుంచైనా సరే ఎవరైనా ఉద్యమంలో భాగం కావచ్చని నిరూపించారు.
చర్చల పద్ధతికి తావే లేదు సాంప్రదాయకంగా రాజకీయ పార్టీలు అనుసరించే వాట్సాప్ ఫార్వర్డ్‌లు, టీవీ చర్చల పద్ధతిని నీట్ నిరసనలో యువత పక్కన పెట్టింది. కేవలం ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్ బుక్ వంటి పలు ప్లాట్ ఫామ్స్ ద్వారా ఉద్యమాన్ని నడిపించింది.
పోలీసులు లాఠీచార్జ్ చేసినా, యువతను అదుపులోకి తీసుకున్నా ఆ వీడియోలను సోషల్ మీడియాలో వేగంగా వైరల్ చేసింది. ప్రభుత్వ అణచివేత చర్యలే సరికొత్త కంటెంట్‌గా, మరింత మంది మద్దతుదారులను తెచ్చిపెట్టాలా రీల్స్, మీమ్స్ వీడియోలు క్రియోట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు.
ఈ డిజిటల్ నిరసనను అణచడం ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారింది. పరిస్థితి చివరకు ఎంతవరకు వచ్చిందంటే.. ప్రధాని నరేంద్ర మోదీ సైతం టీవీ ప్రసంగాలు, అధికారిక ప్రకటనలను నమ్ముకోకుండా అర్ధరాత్రి సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి నేరుగా యువతతో మాట్లాడాల్సి వచ్చింది.
స్వచ్ఛమైన యువజన నిరసన
ఈ ఉద్యమం రాజకీయ పార్టీలకు కూడా ఒక పెద్ద సందిగ్ధతను తెచ్చిపెట్టింది. కాంగ్రెస్, ఆప్ వంటి ప్రతిపక్షాలు విద్యార్థుల నిరసనను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూశారు. అయితే, ఇది పూర్తిగా నాయకులు లేని స్వచ్ఛమైన యువజన ఉద్యమం కావడంతో చివరకు దూరమైపోయారు.
మరోవైపు, న్యూ ఇండియా అనే ఆశలతో పెరిగిన ఈ తరానికి ప్రభుత్వ వైఫల్యాలు కఠినమైన పాఠాలు నేర్పించాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా ఉత్సాహం తాత్కాలికమే అయినా.. పదేపదే జరిగే వ్యవస్థాగత లోపాలను ఇకపై తాము సహించేది లేదని మొబైల్ ఫోన్ల ద్వారా దేశ యువత చాటిచెప్పిందంటున్నారు. ఏ యువశక్తి అయితే ప్రభుత్వాలను సింహాసనంపై కూర్చోబెట్టిందో.. యువశక్తి ఇకపై తప్పులను ప్రశ్నిస్తూ ప్రభుత్వాలకు అసలైన పరీక్ష పెట్టనున్నట్లు పేర్కొన్నారు.
