
- 8న ప్రారంభించనున్న మంత్రి దామోదర
- క్యాన్సర్ పేషెంట్లకు తప్పనున్న కీమోథెరపీ తిప్పలు
హైదరాబాద్, వెలుగు: క్యాన్సర్ పేషెంట్ల కీమోథేరపీ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తీసుకొస్తున్న క్యాన్సర్ డే కేర్ సెంటర్లు సిద్ధమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోని మెడికల్ కాలేజీల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఈ నెల 8న హైదరాబాద్ లోని ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి నుంచి వర్చువల్ గా లాంచ్ చేయనున్నారు. క్యాన్సర్ రోగులకు కీమోథెరపీని చేరువ చేసేందుకు అత్యాధునిక వసతులతో జిల్లా కేంద్రాలలో రాష్ట్ర ప్రభుత్వం డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
ఒక్కో సెంటర్ లో 20 బెడ్లను ఏర్పాటు చేసి, చికిత్స అందించనుంది. ఈ కేంద్రాల్లోనే కీమోథెరపీ నిర్వహించేందుకు అవసరమైన ఎక్విప్ మెంట్లు, ఇతర వైద్య సదుపాయాలను కూడా కల్పించారు. పేషెంట్ ఒక్క రోజులోనే ఇంటికి వెళ్లేలా సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఖర్చు తగ్గడమే కాకుండా, ఎంఎన్ జే, నిమ్స్, బసవతారకం వంటి పెద్ద ఆసుపత్రులపై భారం కూడా తగ్గనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 33 డే కేర్ సెంటర్లకు ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గా పనిచేయనున్నది.
మొదట డే కేర్ సెంటర్లలో పేషెంట్లకు క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే వారిని హైదరాబాద్ లోని ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రికి రిఫర్ చేస్తారు. అక్కడ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి, నిర్ధారణ అయితే మొదటి కీమోథెరపీ కూడా అక్కడే చేయనున్నారు. ఆ తరువాత కీమో సెషన్లను పేషెంట్ సొంత జిల్లాలోని క్యాన్సర్ డేకేర్ సెంటర్ కు రిఫర్ చేయనున్నారు. దీంతో రోగులకు ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది.