- గాంధీలో మదర్ మిల్క్ బ్యాంక్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ ప్రారంభం
పద్మారావునగర్, వెలుగు: ‘‘వైద్య వృత్తి సంపాదన కోసం చేసే ఉద్యోగం కాదు.. జీవితాంతం మానవ సేవకు అంకితమయ్యే ఒక పవిత్రమైన కర్తవ్యం” అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో జరిగిన ఎంబీబీఎస్ 68వ బ్యాచ్ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 250 మంది 2020 బ్యాచ్ వైద్య విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన మదర్ మిల్క్ బ్యాంక్‌ను, రూ. 40 కోట్లతో నిర్మించిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. 170 ఏళ్ల చరిత్ర ఉన్న గాంధీ ఆస్పత్రి కరోనా టైమ్‌లో లక్షల మంది ప్రాణాలు కాపాడిందని కొనియాడారు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్‌లో 6 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, 25 ఐసీయూ బెడ్లు ఉన్నాయని, ఇది పేదలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు.
ఇటీవల ఉస్మానియాలో 18 నెలల చిన్నారికి కాలేయ మార్పిడి చేసిన డాక్టర్ మధుసూదన్‌ను మంత్రి ఘనంగా సన్మానించారు. అలాగే గాంధీ ఐవీఎఫ్ సెంటర్‌లో చికిత్స పొంది కవల పిల్లలకు జన్మనిచ్చిన దంపతులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సర్కార్ దవాఖానల్లో ఐవీఎఫ్ సేవలను ఇంకా పెంచుతామని భరోసా ఇచ్చారు. తెలంగాణ సర్కార్ హెల్త్ సెక్టార్‌కు పెద్దపీట వేస్తోందని మంత్రి వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ బల్మూర్ వెంకట్, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రమేశ్ రెడ్డి, డీఎంఈ నరేంద్ర కుమార్, ప్రిన్సిపాల్ ఇందిరా పాల్గొన్నారు.
