మహారాష్ట్ర సర్కారుకు తలనొప్పిగా మారిన ఏక్ నాథ్ షిండే

మహారాష్ట్ర సర్కారుకు తలనొప్పిగా మారిన ఏక్ నాథ్ షిండే

మహారాష్ట్రలోని మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వానికి మరో తలనొప్పి మొదలైంది. ఇప్పటికే శాసనమండలి ఎన్నికల్లో దెబ్బతిన్న ఈ సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన రాష్ట్ర కేబినేట్ మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే, తన అనుచరులతో కలిసి అకస్మాత్తుగా అదృశ్యమైనట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో లేరని సమాచారం. అయితే ప్రస్తుతం వీరంతా గుజరాత్ సూరత్ లోని ఓ హోటల్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరంతా కూడా పార్టీకి చెందిన ఏ ఫోన్ కాల్స్ కి కూడా స్పందించడం లేదని టాక్. మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది. 

తాజా పరిణామాల మధ్య మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సమాచారం. ఏక్​నాథ్​ వ్యవహారంపై పార్టీ నేతలు, శాసన సభ్యులతో ఆయన చర్చించనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక మరో పక్క ఏక్​నాథ్​ షిండే కూడా మీడియా సమావేశాన్ని నిర్వహించి, సంకీర్ణ ప్రభుత్వంపై తన అభిప్రాయాన్ని తెలుపుతారని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు బీజేపీ నేతలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఇంకా ముదిరితే అఘాడీ సర్కారు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 20మంది ఎమ్మెల్యేలు  క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్టు సమాచారం. అయితే వీరిలో కొంతమంది ఏక్ నాథ్ వర్గానికి చెందిన వారు కూడా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అందరూ హాజరు కావాలనే నిబంధనను కూడా జారీ చేశారు. అందులో భాగంగా పార్టీ నేతలను సంప్రదించే క్రమంలో ఏక్ నాథ్ గురించి ఆరా తీయగా అందుబాటులో లేరనే వార్త బయటకు వచ్చింది.

మహారాష్ట్రలో శివసేన రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహారంతో అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ మరోసారి తెరపైకి వచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలున్నాయి. ఇందులో 145 మ్యాజిక్ ఫిగర్. తమ పార్టీల నుంచి ఎవరెవరు బీజేపీతో టచ్ లో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు శివసేన, ఎన్సీపీ నేతలు. మహావికాడ్ అఘాఢీ బలం 169గా ఉంది. శివసేనకు 56 మంది, ఎన్సీపీకి 53 మంది, కాంగ్రెస్ కు 44 మంది, స్వతంత్రులు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 30 మందికి పైగా ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవిస్ ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ మాదిరి రాజకీయాలు మహారాష్ట్రలో పని చేయవని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అంటున్నారు. మరి నెంబర్ గేమ్ లో ఏం జరుగుతుందన్నది ఇవాళ క్లారిటీ రానుంది.