
ఎంజీఎం వ్యవహారం అంతా గాడిన పడాలె.. లేకుంటే కష్టమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డాక్టర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై హాస్పిటల్ సూపరింటెండెంట్‌తో మాట్లాడాలంటూ కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్‌ను ఆదేశించారు. మంత్రి దయాకర్ రావు గురువారం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌ల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్‌తో కలిసి ఓపీ విభాగంలో అన్ని రూమ్‌లు తిరిగి పరిస్థితి తెలుసుకున్నారు. ఓపీలో డ్యూటీ డాక్టర్లు లేని విషయాన్ని గుర్తించారు. అటెండెన్స్ రిజిష్టర్ పరిశీలించారు. డుమ్మా కొట్టిన డాక్టర్లతో ఫోన్లో మాట్లాడారు.
డాక్టర్‌గారూ…. ఎక్కడున్నారంటూనే మందలించారు. వైద్యం కోసం వచ్చిన పేషెంట్లతో మాట్లాడారు. డ్యూటీలో ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ రోజు ఇదే కథా… డాక్లర్లు రారా? అని ప్రశ్నించారు. ఓపీలో డ్యూటీలో లేని ఐదుగురు సీనియర్ డాక్టర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డుమ్మా డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్‌రావుపై మండిపడ్డారు. ఏం సూపర్‌వైజ్ చేస్తున్నవయ్య? ఇట్లుంటే పేషెంట్లకు వైద్యం ఎట్లందుతది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రిన్సిపల్గారూ మీరూ పట్టించుకోవాలె… అంటూ కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యను సున్నితంగానే మందలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎంజీఎం వచ్చే పెషెంట్లకు వైద్యసేవలందించడంలో లోపాలున్నాయన్నారు. మరోసారి ఇలా జరిగితే కఠినంగా వ్యవహరిస్తామని డాక్టర్లను హెచ్చరించారు. హాస్పిటల్‌లో వంద శాతం బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు చేయాలని ఎంజీఎం సూపరెంటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యలను కలెక్టర్ పాటిల్ ఆదేశించారు.