
కరీంనగర్ జిల్లా: కరువు వచ్చినా దేశానికి అన్నం పెట్టే సత్తా తెలంగాణ రాష్ట్రానికే ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దేశ వ్యాప్తంగా1.5 కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం ఎఫ్‌సీఐ కి అందిస్తే, అందులో 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లోని మల్లన్న పల్లి ,రాచపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా చాలా రోజుల నుంచి అందరినీ ఆత్మీయంగా కలవలేక పోయానని అన్నారు. మొలకలు వచ్చిన, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయకుండా మిల్లర్లు ఇబ్బంది పెడితే రైతులు నష్టపోతారని పల్లెలన్నీ తిరుగుతున్నానని అన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లు చట్టంతో ఇక్కడి మిల్లర్లు ఏ రాష్ట్రం నుంచి అయిన ధాన్యం కొనుగోలు చేసే సౌలభ్యంతో పక్క రాష్ట్రాల నుండి మన రాష్ట్రానికి ధాన్యం తెస్తున్నారని, ఇది మనకు నష్టం చేస్తుందన్నారు. సీసీఐ కూడా పత్తి కొనుగోలు చేయకుండా , పత్తి రంగు మారిందని రైతులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ లేదని, వారికి రైతుల గురించి మాట్లాడే నైతికత లేదని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి కంటే ఎక్కువగా ఆలోచించే పార్టీ ఏదీ ఉండదని, రైతుల కోసం చెప్పేది ఎవరో? చేసేది ఎవరో? ప్రజలు అర్దం చేసుకోవాలని మంత్రి ఈటల అన్నారు.