
- రైతులను కాల్చిచంపిన చంద్రబాబుకు వారసుడు రేవంత్‌రెడ్డి
- రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట రూరల్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ఎండా కాలంలో కూడా చెరువులు నింపుకున్నామని, 24 గంటల కరెంట్ కోసం రూ.12వేల కోట్లు పెడ్తున్నామని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ పార్టీ లీడర్లు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామ రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. కాలం అయినా కాకపోయినా.. రెండు పంటలు పండే నీళ్లు మన దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు. కరెంట్ బిల్లులు తగ్గించమన్న రైతులను బషీర్‌బాగ్‌లో కాల్చి చంపించిన మాజీ సీఎం చంద్రబాబు వారసుడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు. మూడు గంటల కరెంట్‌తో మూడు ఎకరాల భూమి కాదు కదా.. గంటకు గుంట భూమి కూడా తడవదన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడో దొంగ రాత్రి కరెంట్ ఇచ్చేవారని, రైతులు ఎన్నో కష్టాలు పడ్డారన్నారు. బావుల వద్దకు వెళ్లి పాము కాట్లతో రైతులు ఎందరో బలయ్యారని, కరెంట్ షాక్‌లతో కూడా రైతులు చనిపోయారని మంత్రి గుర్తు చేస్తూ, అలాంటి కాంగ్రెస్ వాళ్లు ఊళ్లలోకి వస్తే తరిమికొట్టాలన్నారు.
నిర్మాణ రంగ ఉపాధికి ఊతం..
సిద్దిపేటలో శాశ్వత నైపుణ్య భవన నిర్మాణంతో ఉమ్మడి మెదక్ జిల్లా నిర్మాణ రంగ నిరుద్యోగులకు ఊరట కలుగనున్నదని మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి వద్ద రూ.10 కోట్ల ఖర్చుతో న్యాక్ బిల్డింగ్ నిర్మాణానికి జడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి శంకుస్థాపన చేశారు.