సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర:మంత్రి హరీష్ రావు

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర:మంత్రి హరీష్ రావు
  • రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి కార్మికుల పిల్లలకు రిజర్వేషన్లు :మంత్రి హరీశ్​రావు  

బెల్లంపల్లి, వెలుగు: తెలంగాణలో రైతుల కరెంట్​మోటార్లకు మీటర్లు పెట్టలేదని రాష్ర్టానికి రావాల్సిన రూ.30వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఆపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్​రావు ఆరోపించారు. దీనికి కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రూ.17 కోట్లతో నిర్మించిన 100 పడకల హాస్పిటల్​, డయాలసిస్​ సెంటర్​ను వ్యవసాయ శాఖ మంత్రి ​నిరంజన్​రెడ్డి, అటవీ శాఖ మంత్రి ​ఇంద్రకరణ్​రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​, ఎమ్మెల్సీ దండె విఠల్​, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్​రావులతో కలిసి బుధవారం ప్రారంభించారు. తర్వాత ఏఎంసీ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన సభలో హరీశ్​​రావు మాట్లాడుతూ రామగుండంలో సింగరేణి సహకారంతో ఏర్పాటు చేసిన మెడికల్​కాలేజీలో కార్మికుల పిల్లలకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎంబీబీఎస్, నర్సింగ్, పారామెడికల్​సీట్లలో రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం కేసీఆర్​ఆదేశాలు జారీ చేశారన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ బెల్లంపల్లిలో మ్యాంగో మార్కెట్​లో పెండింగ్ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. జడ్పీ చైర్​పర్సన్​ నల్లాల భాగ్యలక్ష్మి, కలెక్టర్ భారతి హోళికేరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​ పాల్గొన్నారు.  

సింగరేణి గనులు అడ్డికి పావుశేరుకు అమ్మేస్తరు 

కాగజ్​నగర్​: సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్రానికే ఉందని, కేంద్రం అమ్మడం జరగదని ప్రధాని మోడీ ప్రకటిస్తే.. కేంద్ర గనుల మంత్రి నాలుగు కోల్ బ్లాక్ లను వేలం వేస్తామని ప్రకటించడం దేనికి సంకేతమని మంత్రి హరీశ్​రావు ప్రశ్నించారు. సింగరేణి గనులను కాపాడుకునేందుకు బీజేపీ హఠావో.. సింగరేణి బచావో నినాదంతో పోరాడాలని పిలుపునిచ్చాడు. గురువారం కుమ్రం భీమ్​ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌‌నగర్‌‌ లో రూ.5 కోట్లతో నిర్మించిన 30 పడకల సామాజిక దవాఖానాను ప్రారంభించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ తెలంగాణ సర్కారు పథకాలను కేంద్రం  నకలు కొడుతోందన్నారు. డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో 950 మంది డాక్టర్లను నియమిస్తామని, దాని తర్వాత ఏ పీహెచ్ సీలో డాక్టర్ పోస్ట్ ఖాళీగా ఉండదన్నారు. వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, అత్రం సక్కు, ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి, కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ లు చాహత్ బజ్ పాయ్, రాజేశం, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ,డీఎంహెచ్ఓ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.