ఆస్పత్రుల అడ్మినిస్ట్రేటివ్​.. ఆఫీసర్లుగా ఆర్డీవోలు

ఆస్పత్రుల అడ్మినిస్ట్రేటివ్​.. ఆఫీసర్లుగా  ఆర్డీవోలు

హైదరాబాద్‌‌, వెలుగు: గవర్నమెంట్ హాస్పిటల్స్‌‌లో రెవెన్యూ డివిజనల్‌‌ ఆఫీసర్లను అడ్మినిస్ట్రేటివ్‌‌ ఆఫీసర్లుగా నియమించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్ ప్రకటించారు. శుక్రవారం కౌన్సిల్ లో జరిగిన క్వశ్చన్‌‌ అవర్‌‌లో అధికార పార్టీ సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్‌‌రావు, ఎంఎస్‌‌ ప్రభాకర్‌‌, మంకెన కోటిరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఏరియా హాస్పిటల్‌‌లో సూపరింటెండెట్ వ్యవస్థ ఉందని వారిపై పర్యవేక్షణ బాధ్యతలను ఆర్డీవోలకు అప్పగించనున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 74  రెవెన్యూ డివిజన్లలోని ఆర్డీవోలకు సర్కారు త్వరలో  ఏరియా హాస్పిటల్స్‌‌ అడ్మిస్ట్రేటివ్‌‌ ఆఫీసర్లుగా అదనపు బాధ్యలు అప్పగించన్నట్లు స్పష్టం చేశారు. తాజాగా మంత్రి ప్రకటనతో ఆర్డీవోలకు అదనపు బాధ్యతలు  అప్పగిస్తారా లేక ఆర్డీవోల వ్యవస్థకే మంగళం పాడనున్నారనే అనే చర్చ జరుగుతున్నది. శుక్రవారం రాష్ట్ర సర్కారు  వీఆర్‌‌ఏ వ్యవస్థను రద్దు చేసి వారిని వేరే శాఖల్లో సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే వీఆర్‌‌వో వ్యవస్థను రద్దు చేసింది. గతంలో ఉన్నట్లు ఎంఆర్‌‌వోలను తహసీల్దార్లుగా, రెవెన్యూ ఇన్‌‌స్పెక్టర్లను గిర్దావర్లుగా పేర్లను మార్చింది. 

హెల్త్​లో డబుల్​ ఇంజిన్​ సర్కార్​లు ఎక్కడున్నయ్​

వైద్య ఆరోగ్య రంగంలో డబుల్​ఇంజన్​ప్రభుత్వాలు ఎక్కడున్నాయో చూసుకోవాలని, ఆ ప్రభుత్వాలు వట్టి డబ్బా కొట్టడం తప్ప అక్కడి ప్రజలకు చేసిందేమి లేదని అసెంబ్లీలో హరీశ్ అన్నారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై అసెంబ్లీలో నిర్వహించిన షార్ట్​డిస్కషన్​కు ఆయన సమాధానమిచ్చారు. నీతి ఆయోగ్​ర్యాంకుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంటే యూపీ19, మధ్య ప్రదేశ్​17వ స్థానాల్లో ఉన్నాయన్నారు..

ఆర్డీవో వ్యవస్థ రద్దు చేస్తారనే అనుమానాలు

ఆర్డీవోలకు ఏరియా హాస్పిటల్స్‌‌ అడ్మిన్‌‌ బాధ్యతలు అప్పగిస్తామనే ప్రకటన రాష్ట్రంలో కొత్త చర్చకు దారి తీస్తోంది. రెవెన్యూ డివిజన్‌‌ ఆఫీసర్స్‌‌ వ్యవస్థను రద్దు చేస్తారనే చర్చ  జోరుగా జరుగుతోంది. ప్రభుత్వం రెవెన్యూలో వీఆర్వో, వీఆర్ఏలను తీసేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 74 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. దాదాపు 90 మంది ఆర్డీవోలు పనిచేస్తున్నారు. ఇటీవల వీరిలో కొంత మందికి ప్రమోషన్ల ఇచ్చారు. ధరణి పోర్టల్‌‌ అందుబాటులోకి వచ్చాక ఆర్డీవోల ప్రాధాన్యతను ప్రభుత్వం క్రమంగా తగ్గిస్తూ వస్తున్నది. తాజాగా మంత్రి ప్రకటనతో ఆర్డీవో వ్యవస్థను రద్దు చేస్తుందా అనే అనుమానాలు తలెత్తు తున్నాయి.