
కొంతమంది డాక్టర్లు ఏలాంటి సమాచారం లేకుండా గైర్హాజర్ అవుతున్నారని, మరికొంతమంది మధ్యాహ్నం వెళ్ళిపోతున్నారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. విధులు సక్రమంగా నిర్వర్తించకుండానే వెళ్ళిపోతున్నట్లు సమాచారం ఉన్నట్లు.. ప్రతి ఒక్కరు వారికి నిర్దేశించిన పనివేళల్లో విధులు నిర్వర్తించాలని సూచించారు. మంగళవారం నల్గొండ మెడికల్ కళాశాల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆసుపత్రిలో ఎంతమంది డాక్టర్లు పని చేస్తున్నారు ? ఈ రోజు ఎంత మంది హాజరయ్యారు ? ఎంతమంది రాలేదు అనే విషయాలు పరిశీలించినట్లు తెలిపారు. ఆస్పత్రిలో అక్కడక్కడ ఉన్న లోపాలను గుర్తించడం జరిగిందని, వాటన్నిటిని అధిగమించి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు. కొత్త కాలేజీ ఆస్పత్రి నిర్మాణం గురించి డాక్టర్లు తన దృష్టికి తీసుకొస్తే.. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని కలెక్టర్ ను ఆదేశించామన్నారు.
కొత్త డైట్ పాలసీ ప్రకారం పేషెంట్లకు ఆసుపత్రుల్లో నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. గైనిక్ డిపార్ట్మెంటులో 500 లోపే ప్రసవాలు జరుగుతున్నాయి. వాటిని 700 వరకు పెంచాలన్నారు. ఆర్థోపెడిక్ విభాగం మరిన్ని కీలక వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సాయంత్రం వేళల్లో ఓపి చూడాలని అడిగితే సానుకూలంగా స్పందించిన వైద్యులకు తాను ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కు రోగులను పంపించడం తగ్గించాలని.. వీలైనంతవరకు ఇక్కడే వైద్య సేవలు అందించాలన్నారు. అత్యవసరమైతే తప్ప హైదరాబాద్ కి రిఫర్ చేయొద్దని డాక్టర్లకు మంత్రి హరీష్ సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని రకాల వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేసేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సీఎం చొరవ వల్లే ఒక్క జిల్లాలోనే రెండు మెడికల్ కళాశాలలో వచ్చినట్లు తెలిపారు. మెడికల్ డైరెక్టర్ రమేష్ త్వరలో జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చి పరిశీలిస్తారన్నారు. మెడికల్ విద్యార్థుల కాలేజీ, హాస్టల్, లైబ్రరీ, సమస్యల పరిష్కరించాలని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. త్వరలో వారి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీనిచ్చారు.