
సిద్దిపేట జిల్లా ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడి మంత్రి హరీష్ రావు.. ఆంధ్యప్రదేశ్ మంత్రులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తను ఏపీ ప్రజలు, మంత్రులను ఉద్దేశించి తప్పుగా మాట్లాడింది ఏమీ లేదని.. ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారో అర్థం కావట్లేదని హరీష్ అన్నారు. వాస్తవాలు మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించిన హరీష్.. తను ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు విషయంలో ఏపీ ప్రజల తరుపు మాట్లాడితే ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నించారు.
ఉమ్మడిగా ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోవద్దంటూ, విడిపోయాక ప్రత్యేక హోదా కావాలంటూ ఉద్యమించిన నాయకులు.. ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని ఏపీ మంత్రులను హరీష్ రావు కోరారు. విశాఖ హోదా కోసం ఎందుకు పోరాడట్లేదని.. పోలవరం ప్రాజెక్టు పనులు ఎందుకు పూర్తి కావట్లేదని మంత్రులను నిలదీశారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకునే హక్కు తమకు ఉందని.. దానికే విమర్శించడం సరికాదని హరీష్ రావు మండి పడ్డారు.
ఏపీ రాష్ట్రంలోకంటే తెలంగాణలో పథకాలు బాగున్నాయి. ఆ విషయాన్నే మాట్లాడా. అంతే కానీ ఎవరినీ కించపరచలేదని హరీష్ రావు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధికి పాటుపడ్డ ప్రతీ ఒక్కరు తెలంగాణ బిడ్డలే అని హరీష్ రావు వెల్లడించారు. ఏపీ నాయకులకు చేతనైతే పోలవరాన్ని పూర్తి చేసి, కాళేశ్వరం లాగా పంటలకు నీళ్లు అందించాలని మంత్రులకు సవాల్ చేశారు హరీష్.