ఉచిత విద్యుత్‌ను ఉత్త విద్యుత్‌గా మార్చిన కాంగ్రెస్: మంత్రి హరీష్ రావు

ఉచిత విద్యుత్‌ను ఉత్త విద్యుత్‌గా మార్చిన కాంగ్రెస్: మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్‌ హయాంలో ఉచిత విద్యుత్‌ను ఉత్త విద్యుత్‌గా మార్చారని మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ అభివృద్ధిని కాంగ్రెస్‌ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి 3 గంటల కరెంట్‌ ఇస్తే 3 ఎకరాల పొలం పారుతుందని చెప్పారు. కాబట్టి రేవంత్‌రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. సంగారెడ్డిలో లబ్ధిదారులకు బీసీ బంధు చెక్కులను, పంచాయతీ కార్యదర్శులకు రెగ్యులరైజేషన్‌ పత్రాలను మంత్రి హరీశ్‌ రావు అందజేశారు. కాంగ్రెస్‌ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఉచిత కరెంటు ఎందుకు లేదని నిలదీశారు. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రంలో గ్రామాల సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు. 

3 శాతం జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి 38 శాతం అవార్డులు రావడం సీఎం కేసీఆర్‌ పనితీరుకు నిదర్శనమని మంత్రి హరీశ్‌ తెలిపారు. 2023 ఆగస్టు 14  సోమవారం నుంచి రూ.99 వేల వరకు రుణమాఫీ చేయనున్నామని పేర్కొన్నారు. ఇచ్చిన మాటప్రకారం వచ్చే 15-20 రోజుల్లో రూ.లక్ష వరకు రుణమాఫీ చేసి తీరుతామని వెల్లడించారు. బీసీలకు రూ. లక్ష ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. కులవృత్తులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో బీసీ బంధు ఇస్తున్నామని చెప్పారు. వెనుకబడిన వర్గాలవారికి రూ.20 లక్షల ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ ఇస్తున్నామని చెప్పారు. 35 వేల సెలూన్లు, 60 వేల లాండ్రీలకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ రాకముందు 19 బీసీ గురుకులాలు ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 310కి చేరిందని చెప్పారు. బీసీల కోసం ప్రభుత్వం వంద కోట్లు ఖర్చుచేస్తున్నదని మంత్రి హరీష్ రావు తెలిపారు.