- మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస్రావు
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలకు సంబంధించి ఈ నెల 11న జరగనున్న ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు తెలిపారు. ఆదివారం ఆయన తన ఆఫీస్లో మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గొడవలకు పాల్పడినట్లయితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో సుమారు 600 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. మొత్తం 75 వార్డులకు 150 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఇందులో 21 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి ప్రత్యేక నిఘా పెట్టినట్లు వివరించారు. 1,206 మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీ షీటర్లను ముందస్తు బైండోవర్ చేసినట్లు చెప్పారు.
జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టడంతో ఆదివారం వరకు రూ.2,69 లక్షల నగదు, 40 కేసుల్లో సుమారు రూ. 5,23,250 విలువైన 557.44 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. రూ.3,36,000 విలువగల 336 గ్రాముల డ్రగ్స్, రూ.9,25,250 విలువైన ఫ్రీబీస్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎంసీసీ ఉల్లంఘించిన ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖకు సహకరించాలని ప్రజలను కోరారు.
