75 పడకల టీచింగ్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

75 పడకల టీచింగ్ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ లోని హంస హోమియోపతి వైద్య కళాశాల,రీసెర్చ్ సెంటర్ లో 75 పడకల టీచింగ్ ఆస్పత్రిని వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎఫ్డీసీ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డిలు ప్రారంభించారు. ములుగు మండలంలో ఇంత గొప్ప ఆసుపత్రి ఉండటం సంతోషమని మంత్రి హరీష్ రావు అన్నారు. 5 వేల బస్తీ, పల్లె దవాఖానాలు స్థాపిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. 50 పడకల ఆయుష్ ఆసుపత్రులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులకు హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉన్నాయన్నారు.

 ఖర్చులు తక్కువ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్యం హోమియోపతి అని హరీష్ రావు స్పష్టం చేశారు. భారతదేశంలోని ఆయుష్ వైద్యం వైపు ప్రపంచమంతా చూస్తోందని చెప్పారు. ఆయుష్ వైద్యం నేర్చకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. శస్త్ర చికిత్సలు వైరస్లాగా తయారయ్యాయన్న మంత్రి... మొదటి గంట పాలు బిడ్డకి అమృతంతో సమానమని చెప్పారు. తెలంగాణలో 67 శాతం మంది శిశువులు మొదటి గంట పాలు తాగలేకపోతున్నారని సర్వేలో తేలిందని హరీశ్ రావు గుర్తు చేశారు. హోమియోపతి కళాశాలకు ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల్లో చైతన్యం తేవడానికి హోమియో విద్యార్థులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.