ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నాం

ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నాం

ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. టీఎస్ఎంఎస్ఐడీసీ ప్రాంగణంలో ప్రోగ్రాం మేనేజ్మెంట్ యూనిట్ ను ప్రారంభించారు. గతంలో ఖరీదైన పరికరాలు కొనుగోలు చేసినప్పుడు వాటి మెయింటెనెన్స్ ఇబ్బంది అయ్యేదని, కానీ PMU ఏర్పాటుతో ఇక ఆ ఇబ్బందులు ఉండవని తెలిపారు. పరికరాల మెయింటెనెన్స్ కోసం ప్రైవేట్ తరహాలో ఎక్విప్మెంట్ పాలసీ తీసుకొచ్చామని వెల్లడించారు. 

గతంలో మాదిరిగా పరికరాల మరమ్మత్తులు ఆలస్యం కావడం లాంటి ఘటనలు ఇకపై ఉండవని మంత్రి  హరీష్ రావు స్పష్టం చేశారు. పరికరాల మరమ్మత్తుల కోసం 24గంటలు అందుబాటులో ఉండేలా కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1020 పరికరాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉన్నాయన్న హరీష్ రావు..వాటి మెయింటెనెన్స్ PMU చూస్తోందని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త పరికరాలను తీసుకురానున్నట్లు వెల్లడించారు. అవసరమైన మెడిసిన్ లిస్ట్, అడిషనల్ మెడిసిన్ లిస్ట్ లను 720 నుంచి 840 గా పెంచినట్లు చెప్పారు. 

కొన్ని ఆస్పత్రులకు అధికారం ఇచ్చామని..అవే అవనరమైన మందులను కొనుగోలు చేస్తాయని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఈ ఔషధీ పోర్టల్ తీసుకొచ్చామన్న మంత్రి..ప్రతి ఆస్పత్రిలో 3 నెలల స్టాక్ ఉండాలని ఆదేశించినట్లు చెప్పారు. ఆస్పత్రులకు 20శాతం డబ్బులు ముందే ఇచ్చామన్న ఆయన.. సూపరింటెండెంట్ లకు పలు అధికారాలు ఇచ్చినట్లు తెలిపారు. ఎక్కడా మందులు కొరత లేకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.