
సిద్దిపేట జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని మొదటి పునరావాస గ్రామాన్ని మంత్రి హరీష్ రావు బుధవారం ప్రారంభించారు. అంతగిరి రిజర్వాయర్ ముంపు గ్రామం లింగారెడ్డి పల్లి (కోచ్చగుట్ట పల్లి) సమీపంలో ఆర్ అండ్ ఆర్ కాలనీ (Remove and Replace) లో నూతనంగా నిర్మించిన 130 డబుల్ బెడ్రూం ఇళ్ల గృహ ప్రవేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి అర్ అండ్ అర్ కాలనీ ఇదేనని అన్నారు. అర్ అండ్ అర్ చట్టం వచ్చిన తర్వాత దేశంలో ఇదే మొదటి అర్ అండ్ అర్ కాలనీగా చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.
మరో 15 రోజుల్లో రంగనాయక సాగర్ లో నీళ్ళు వస్తాయి కాబట్టి గ్రామస్తులంతా ఇండ్లు ఖాళీ చేయాలని చెప్పారు మంత్రి. రంగనాయక పురం గా నామకరణం చేసిన ఈ కొత్త కాలనీలో … పాఠశాల, ఫంక్షన్ హాల్ ను నిర్మిస్తామని హరీశ్ రావు చెప్పారు. హనుమాన్ దేవాలయం కూడా ఈ గ్రామంలో నిర్మిస్తామని ఆయన అన్నారు. రంగనాయక సాగర్ లో ఎప్పుడు నీళ్ళు నిండి ఉంటాయి కాబట్టి.. ఇక్కడ ప్రజలకు ఆ చెరువులో చేపలు పట్టుకునే పూర్తి స్వేచ్చ ఉంటుందని చెప్పారు. చేపల చెరువుల మీద గ్రామ ప్రజలకు పూర్తి హక్కు కల్పిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూనిర్వసితులెవరూ కోర్టుల చుట్టూ తిరగలేదని , వెంటనే వారికి ఇండ్లను మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.