దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. దింతో కాలుష్యన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా కొన్ని కఠినమైన నిర్ణయాలు ప్రకటించింది. డిసెంబర్ 18 గురువారం నుండి వాహనాలకు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ (PUCC) వాలిడిటీ లేకుంటే ఆ బండికి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్/డీజిల్ నిషేధించింది. ఈ విషయాన్ని ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా ఇవాళ (మంగళవారం, డిసెంబర్ 16న) చెప్పారు. అలాగే పాత బండ్ల నుండి వచ్చే పొగ వల్ల కాలుష్యం మరింత పెరుగుతోంది. అందుకే ఈ నియమాలను చాలా కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. పెట్రోల్ పోసే ముందు PUC సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా చెక్ చేయాలని బంకులకు ఆదేశాలు ఇచ్చారు.
కొత్త వాహనాలకే ఎంట్రీ:
డిసెంబర్ 18 గురువారం నుండి ఢిల్లీ రాష్టంలోకి వచ్చే వాహనాల్లో BS-VI ప్రమాణాలకు అనుగుణంగా ఉండే కొత్త బండ్లను మాత్రమే ఢిల్లీ ఢిల్లీ రాజధానిలోకి అనుమతిస్తారు. పక్క రాష్ట్రాల నుండి వచ్చే పాత వాహనాలు, అధిక కాలుష్యాన్ని వదిలే వాహనాల రాకపోకలను ఆపడానికే ఈ చర్య తీసుకున్నారు.
భారీ జరిమానాలు: నిర్మాణ వస్తువులు తీసుకెళ్లే ట్రక్కులు కాలుష్య నియమాలను పాటించకపోతే, వాటిపై పెద్ద మొత్తంలో జరిమానాలు విధిస్తామని మంత్రి హెచ్చరించారు. అలాంటి ట్రక్కులను స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు.
గాలి నాణ్యత :
ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత కొద్దిగా మెరుగుపడినా, అది ఇంకా చాలా ప్రమాదకరమైన స్థాయిలోనే ఉంది. మంగళవారం ఉదయం గాలి నాణ్యత సూచిక (AQI) 377గా నమోదైంది. ముందు రోజు 498గా ఉంది. ఉదయం ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోవడం.. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాలు సరిగ్గా కనిపించడం లేదు, దింతో ట్రాఫిక్‌తో పాటు పనులను కూడా ఆటంకం ఏర్పడుతుంది. కలుషితమైన గాలి వల్ల ప్రజలు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ఈ చర్యలు తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతుంది. ప్రజలు కూడా వాహనాల ఉద్గార నియమాలను పాటించి, కాలుష్య నియంత్రణకు సహకరించాలని అధికారులు కోరారు.
