నెలకు ఎన్ని ఆపరేషన్లు చేస్తున్నరు?

నెలకు ఎన్ని ఆపరేషన్లు చేస్తున్నరు?

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో జరుగుతున్న ఆర్థోపెడిక్ సర్జరీల సంఖ్యపై మంత్రి హరీశ్‌‌రావు ఆరా తీశారు. ప్రైవేటు హాస్పిటళ్లలో కంటే ఎక్కువ మంది డాక్టర్లు ఉన్న ప్రభుత్వ దవాఖాన్లలో కూడా తక్కువ సంఖ్యలో ఆపరేషన్లు జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రైవేటు హాస్పిటళ్లలో ఉదయం 8కే ఆపరేషన్లు మొదలవుతుంటే, ప్రభుత్వ దవాఖాన్లలో పది గంటల వరకూ థియేటర్లు ఎందుకు తెరుస్తలేరో చెప్పాలని సూపరింటెండెంట్లను ప్రశ్నించారు. హైదరాబాద్‌‌లోని ఎంసీఆర్‌‌‌‌హెచ్‌‌ఆర్డీలో ప్రభుత్వ దవాఖాన్ల సూపరింటెండెంట్లు, ఆర్థోపెడిక్ డాక్టర్లతో ఆదివారం మంత్రి సమావేశం నిర్వహించారు. వివిధ ప్రైవేటు హాస్పిటళ్ల డాక్టర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాన్లలో వాడుతున్న ఆర్థోపెడిక్ ఎక్విప్‌‌మెంట్, టెక్నాలజీ తదితర అంశాల గురించి మంత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉన్న డాక్టర్ల సంఖ్య, నెలకు సగటున చేస్తున్న సర్జరీల సంఖ్య తదితర అంశాలను పోల్చి చూశారు. మెజారిటీ టీచింగ్ హాస్పిటళ్లలో పనితీరు బాగాలేకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రభుత్వ దవాఖాన్లలో ఆర్థోపెడిక్ సేవలు మెరుగయ్యేందుకు సహకారం అందించాలని ప్రైవేటు డాక్టర్లను మంత్రి కోరారు.

ఊళ్లలో ఆర్థో క్యాంపులు

గ్రామాల్లో ఆర్థోపెడిక్ క్యాంపులు ఏర్పాటు చేయడంపై సమావేశంలో చర్చించారు. ఈ క్యాంపుల ద్వారా మోకీలు మార్పిడి, తుంటి మార్పిడి వంటి సర్జరీలు అవసరమయ్యే పేషెంట్లను గుర్తించి, ప్రభుత్వ దవాఖాన్లలో ఉచితంగా ఆపరేషన్లు చేయించాలని భావిస్తున్నారు. ఈ ప్రోగ్రామంతా ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో నడిచేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని హెల్త్ ఆఫీసర్లకు మంత్రి సూచించినట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని హాస్పిటళ్లలో అన్ని రకాల ఆర్థోపెడిక్ సర్జరీలు చేయాలన్నారు. జిల్లా హాస్పిటళ్ల నుంచి హైదరాబాద్‌‌కు రిఫర్ చేసి పేషెంట్లను ఇబ్బంది పెట్టొద్దన్నారు. సమావేశంలో టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ కార్పొరేషన్‌‌ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌‌, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్‌‌రెడ్డి, టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌‌‌‌రెడ్డి, డాక్టర్ గంగాధర్, ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు పాల్గొన్నారు.