కంటి వెలుగు మరింత ప్రభావవంతంగా నిర్వహించాలె : మంత్రి హరీశ్

కంటి వెలుగు మరింత ప్రభావవంతంగా నిర్వహించాలె : మంత్రి హరీశ్

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం "ఆరోగ్య మహిళ" కార్యక్రమానికి శ్రీకారం చుడుతోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన ఇవాళ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధిపై బిఆర్కే భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఎంహెచ్ఓలు, ఎస్పీలు, పంచాయతీ, మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం, ఈ నెల 8న ప్రారంభించే అరోగ్య మహిళ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మహిళల సమగ్ర అరోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి సూచనల మేరకు వైద్యారోగ్య శాఖ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. మహిళలు ప్రధానంగా ఎదుర్కునే 8 రకాల ఆరోగ్య సమస్యలకి వైద్యం అందిస్తుందని తెలిపారు. ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర మహిళలకు బహుమతిగా ప్రభుత్వం దీన్ని అందస్తున్నాదని వెల్లడించారు. ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు ప్రారంభిస్తామన్నారు. మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో, మొత్తం 1200 లకు విస్తరించాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు.

 "ఆరోగ్య మహిళ" అందించే సేవలు..

  • మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు చేస్తారు.
  • ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్.. 
  • థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు.
  • మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు.
  • మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్ తో అవగాహన కలిగిస్తారు.
  • నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.
  • సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు. 
  • బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు.

ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు, ప్రత్యేక యాప్ ద్వారా మానిటరింగ్ ఉంటుందని మంత్రి హరీశ్ తెలిపారు.తెలంగాణ డయాగ్నొస్టిక్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారు. రెఫరల్ సెంటర్లు ప్రభుత్వ పెద్దాసుపత్రులు ఉంటాయి. సంబంధిత మహిళకు పూర్తిగా నయం అయ్యే దాకా వైద్య సేవలు అందించే కార్యక్రమం..రిఫరల్ ఆసుపత్రుల్లో మహిళలకు సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఉంటాయని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని విజవంతంగా నిర్వహించాలని.. ఈ ప్రత్యేక సేవల గురించి అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. మార్చి 8 రోజున ప్రారంభించే కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిదులు పాల్గొనేలా చూడాలని. జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్ఓలు చొరవతో పర్యవేక్షించాలని హరీశ్ రావు కోరారు.