టీకా రెండో డోస్ అందరూ తప్పకుండా తీసుకోవాలి

టీకా రెండో డోస్ అందరూ తప్పకుండా తీసుకోవాలి

రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు తెలిపారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.  ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించాలని.. కరోనా టీకా రెండవ డోస్ కూడా అందరూ తప్పనిసరిగా వేసుకోవాలని తెలిపారు. జన రద్దీ ప్రాంతాలలో మాస్కు ధరించి.. భౌతిక దూరం పాటించాలన్నారు. గర్భిణీలు కరోనా టీకాలు తీసుకోవద్దనే అపోహలు వద్దని, అందరూ తీసుకోవచ్చునని డాక్టర్లు చెబుతున్నారని ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. మీరు కోరితే మీ ఇంటింటికీ వచ్చి కరోనా టీకాలు వేయిస్తామని మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు.
 
 సిద్ధిపేట జిల్లాలోని  27వ మున్సిపల్ వార్డు గణేష్ నగర్ లో రూ.15 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రజా ప్రయోజనార్థం, ప్రజల మనస్సులో ఉన్నది నెరవేర్చడమే మా ప్రయత్నం అని తెలిపారు. వార్డుల్లో యూజీడీ పనులు వెంటనే చేయించాలని అధికారులను ఆదేశిస్తూ.. నల్లా నీళ్ల తరహాలో ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేలా గ్యాస్ పైపు లైన్లు వేయిస్తున్నామని, తొందరగా పైపు లైన్లు పనులు పూర్తి చేయించి, రోడ్లు వేసుకుందామని ప్రజలకు మంత్రి వివరించారు.
 
యూజీడీ కోసం ప్రజలు సహకరించాలన్నారు హరీశ్. దీంతో దోమలు, ఈగలు, రోగాలు రాకుండా ఉంటాయని తెలిపారు.  ఆరోగ్య సిద్దిపేట కోసం అభివృద్ధి పనులు చేస్తున్నామని, ప్లాస్టిక్ రహిత సిద్ధిపేట దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రజలంతా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని, స్టీల్ బ్యాంకులు వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. ఆరోగ్యంగా ఉండేందు కోసం యోగా, వాకింగ్ చేయాలని ప్రజలను కోరారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశం త్వరలోనే కల్పిస్తామని చెప్పారు. తడి, పొడి, హానికరమైన చెత్తలను వేర్వేరుగా ఇచ్చి స్వచ్ఛ సిద్ధిపేటకు సహకరించాలని, అలాగే సిద్ధిపేట బురుజు  దగ్గర ఏర్పాటైన స్వచ్ఛబడికి పోవాలని, అక్కడ చెత్త ద్వారా ఎరువు తయారు చేసే విధానం, చెత్తతో అనర్థాలు, ప్లాస్టిక్ తో కలిగే అనర్థాలు వివరిస్తారని, ప్రజలు అవగాహన పొంది స్వచ్ఛ సిద్ధిపేటకు సహకారాన్ని అందించాలని కోరారు.

అనాథలు, అభాగ్యులు రోడ్లపై తిరుగుతూ జీవనం సాగిస్తున్న వారి కోసం ప్రభుత్వం నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేసిందని.. ఈ కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు నిర్వాహకులకు సూచించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట మణికంఠ నగర్ లో మెప్మా-డీఏవై-ఎన్ యూఎల్ఏం- ఆధ్వర్యంలో రూ.72.82 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన పట్టణ నిరాశ్రయుల ఆశ్రయ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.  తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, అందుకే సమాజంలోని ఏ ఒక్క పేదలూ ఆకలితో అలమటించకూడదని ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నైట్ షెల్టర్ లో అనాథలకు ప్రతీరోజూ ఉచితంగా టిఫిన్, భోజనం, బెడ్, లాకర్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. అలాగే తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వినోదం, పచ్చదనం-పరిశుభ్రత వంటి మెరుగైన సౌకర్యాలను కల్పించే దిశగా చర్యలు తీసుకున్నట్లు, ఈ కేంద్రంలో సేద తీరుతున్న పేదల పట్ల సామాజిక సృహతో వ్యవహరించాలని నిర్వాహకులను మంత్రి కోరారు.