కేంద్రం ఇచ్చే నిధులపై చర్చకు సిద్ధం: మంత్రి హరీష్ రావు

కేంద్రం ఇచ్చే నిధులపై చర్చకు సిద్ధం: మంత్రి హరీష్ రావు

జగిత్యాల, వెలుగు: ఈడీ, ఐటీ దాడులతో టీఆర్ఎస్ నాయకులను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ నెల 7న జగిత్యాల జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో మోతెలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ కవితతో కలిసి హరీశ్ పరిశీలించారు. సభ సజావుగా సాగేందుకు లీడర్లకు, అధికారులు పలు సూచనలు చేశారు. ఆ తర్వాత హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు చెప్పే అబద్ధాలను నమ్మడానికి ఇది అమాయకపు తెలంగాణ కాదని, ఉద్యమాల గడ్డ అని అన్నారు. జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి కేంద్రం రూ.8 వేల కోట్లను ఇచ్చిందని చెప్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలివి ఉండే మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. కేంద్రానికి, తెలంగాణ నుంచి రూ.30 వేల కోట్లు పన్నుల రూపంలో వెళ్తే అందులో వచ్చింది రూ.8 వేల కోట్లేనని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధుల్లో వాటాను కుట్రపూరితంగా తగ్గించిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడుతున్న బండి సంజయ్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నెలకు లక్ష కోట్లు అప్పు చేస్తుంటే ఎందుకు మాట్లాడడం లేదని మండిపడ్డారు. బీజేపీ జూటా మాటలతో ప్రజలను మోసం చేస్తోందని, గోబెల్స్ ప్రచారాన్ని ఎవరూ నమ్మరని అన్నారు. కాగా, లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. మూడు గంటల పాటు ఇక్కడే గడిపినా మీడియాతో మాట్లాడలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, జీవన్ రెడ్డి, సుంకే రవిశంకర్, చెన్నమనేని రమేశ్ బాబు, ఎమ్మెల్సీలు రమణ, పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి.రవి, ఎస్పీ సింధుశర్మ పాల్గొన్నారు.