పదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధి సాధించాం: మంత్రి హరీష్

పదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధి సాధించాం: మంత్రి హరీష్

పసి రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో పదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధిని సాకారం చేసుకున్నామని చెప్పడం గర్వంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. జూన్ 2వ తేదీ శనివారం తెలంగాణ దశబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయన సిద్దిపేటలోని డిగ్రీ కళాశాల మైదానంలో జెండా ఆవిష్కరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. జయజయహే తెలంగాణ.. జననీ జయకేతనం అంటూ తొమ్మిది సంవత్సరాల ప్రగతియాత్రను పూర్తి చేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని అన్నారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశానికే దశా, దిశా నిర్దేశించేలా ఉన్నాయని తెలిపారు మంత్రి హరీష్.

పధ్నాలుగేళ్ల పోరాటం, తొమ్మిదేళ్ల సంకల్పంతో నేడు తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా నిలిచింది..ఇది మనమంతా గర్వపడాల్సిన సందర్భమని హరీష్ రావు వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ దీక్షాదక్షతలో మన రాష్ట్రం ముందడుగు వేస్తున్నదని.. సిద్దిపేట జిల్లా సైతం ఎన్నో కీర్తికిరీటాలను సొంతం చేసుకుందని చెప్పుకొచ్చారు. తొమ్మిదేళ్ల క్రితం నాటి అచేతనావస్థలు... ఇప్పటి అద్భుతమైన స్థితిగతులను మననం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.