
- ఎన్నో బస్తీ దవఖానాలు ఏర్పాటైనయ్
- బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి
ఉప్పల్, వెలుగు : సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాతే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మల్లాపూర్‌లోని వీఎన్ఆర్ గార్డెన్లో ఉప్పల్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డికి మద్దతుగా నిర్వహించిన బీఆర్ఎస్ మహిళా ఆత్మీయ సమ్మేళనానికి హరీశ్ రావు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఏం చేశారు..
గతంలో కాంగ్రెస్ ఏం చేసిందో అక్కా చెల్లెళ్లు కొంత ఆలోచన చేయాలన్నారు. పొద్దున లేస్తే మంచి నీళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండేదో గుర్తు చేసుకోవాలన్నారు. గతంలో మహిళలు బిందెలతో ఎక్కడో ఉన్న బోరు బావుల దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చుకునేవారని.. ఇయ్యాల కేసీఆర్ మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తున్నారని ఆయన చెప్పారు. మిషన్ భగీరథ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం కాఫీ కొట్టి ‘హర్ ఘర్ కా జల్’ అని పేరు పెట్టిందని విమర్శించారు.
ఉప్పల్ సెగ్మెంట్లో 100 పడకల ఆస్పత్రిని మంజూరు చేశామని.. ఎన్నో బస్తీ దవఖానాలు వచ్చాయన్నారు. లక్ష్మారెడ్డిని గెలిపిస్తే మరిన్ని బస్తీ దవఖానాలు వస్తాయన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ఒక్క పేకాట క్లబ్ లేకుండా అన్నింటిని క్లోజ్ చేశామన్నారు. లక్ష్మా రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని హరీశ్ రావు కోరారు.