
హైదరాబాద్, వెలుగు: గడిచిన తొమ్మిదేండ్లల్లో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం ఆయన సెక్రటెరియెట్‌లో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ..60 ఏండ్లల్లో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. అతి తక్కువ కాలంలో 21 మెడికల్ కాలేజీలు ప్రారంభించి రికార్డు సృష్టించామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని 25 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటుకాగా.. మిగిలిన 8 జిల్లాల్లోనూ ప్రారంభించేందుకు ప్రతిపాదనలు రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు.
నేటితో వందో రోజుకు ‘కంటి వెలుగు’
‘కంటి వెలుగు’ ద్వారా 99 పనిదినాల్లో కోటి 61 లక్షల మందికి పరీక్షలు నిర్వహించామని వైద్య హరీశ్ రావు తెలిపారు. ‘కంటి వెలుగు’ కార్యక్రమం శనివారంతో వందో రోజుకు చేరనుందని, ఈ పథకం విజయవంతంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ‘‘దృష్టిలోపం ఉన్న 40.59 లక్షల మందికి కంటి వెలుగు పథకం కింద కండ్లద్దాలు పంపిణీ చేసినం. వారిలో 22.51 లక్షల మందికి ఉచితంగా కండ్లద్దాలు, మెడిసిన్స్ అందించాం. 18.08 లక్షల ప్రిస్కిప్షన్ గ్లాసెస్ పంపిణీ చేసినం. మొత్తంగా ఇప్పటికే 24 జిల్లాల్లో కంటి వెలుగు కార్యక్రమం పూర్తయింది” అని మంత్రి వివరించారు.