సిద్ధిపేట జిల్లా: వసంత పంచమినాడు సరస్వతి దేవిని ఆరాధిస్తే శుభం కలుగుతుందని , అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞానరాశులవుతున్నారన్నది మన నమ్మకమని అన్నారు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు. వసంత పంచమి సందర్భంగా మంత్రి హరీశ్ రావు సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం అనంతసాగర్ గ్రామంలోని శ్రీ సరస్వతీ దేవి ఆలయాన్ని దర్శించుకున్నారు. వేద పండితులు పూర్ణకుంభంతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేద పండితుల ఆశీర్వచనం పొందారు.
అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ… అనంత సాగర్ లో శ్రీ సరస్వతి అమ్మవారు మూర్తి (విగ్రహం) నిల్చుని ఉన్న వీణా పుస్తక జపమాలధారిణి. ఈ మూర్తి గల దేవాలయము దేశంలో ఇక్కడే ఉండటం మన తెలంగాణ ప్రాంత ప్రజల అదృష్టమని చెప్పారు. సరస్వతి దేవి ఆరాధన వల్ల వాక్శుద్ధి కలుగుతుందని, అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతామని, మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, ఇవన్నీ పొందుతామని చెప్పారు. ఆలయ ఆవరణలో రాగి, చీకటి, పాల దోనెలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం మెట్లు నిర్మించేందుకు రూ.10లక్షలు వెచ్చిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.