పేషెంట్లకు మర్యాద ఇవ్వకపోతే హెల్త్ సిబ్బందిపై చర్యలు: మంత్రి హరీష్ రావు

పేషెంట్లకు మర్యాద ఇవ్వకపోతే హెల్త్ సిబ్బందిపై చర్యలు: మంత్రి హరీష్ రావు
  • నర్సులు, స్టాఫ్‌‌‌‌కు మంత్రి హరీశ్ ​హెచ్చరిక
  • సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు సూపరింటెండెంట్లకు పవర్స్‌‌‌‌ 
  • స్టాఫ్‌‌‌‌లో మార్పు రాకపోతే అధికారులపైనా చర్యలు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ హాస్పిటళ్లలో పేషెంట్లతో అమర్యాదగా మాట్లాడితే హెల్త్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య మంత్రి హరీశ్‌‌‌‌రావు హెచ్చరించారు. డాక్టర్‌‌‌‌‌‌‌‌ నుంచి అటెండర్ వరకు పేషెంట్లతో ప్రతి ఒక్కరూ మర్యాదగా, ప్రేమగా మాట్లాడాలని సూచించారు. ఎంత పెద్ద బిల్డింగులు కట్టినా, ఎంత మంది డాక్టర్లను పెట్టినా పేషెంట్‌‌‌‌ను ప్రేమగా చూడకపోతే లాభం ఉండదన్నారు. ఈ విషయంలో ఎవరు తప్పు చేసినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు అన్ని హాస్పిటళ్ల సూపరింటెండెంట్లతో మంత్రి ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పేషెంట్లు, వారి సహాయకుల పట్ల స్టాఫ్ నర్సుల దురుసు వైఖరి మారాలన్నారు. నర్సులు, ఆయాలు, శానిటేషన్ సిబ్బంది, డైట్ సిబ్బంది ప్రవర్తన బాగలేకపోతే ఉపయోగం లేదని చెప్పారు. దురుసుగా ప్రవర్తించినా, డబ్బులు వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు హాస్పిటల్‌‌‌‌ సూపరింటెండెంట్లకు పూర్తి అధికారాలు ఇస్తున్నామని తెలిపారు. సిబ్బంది ప్రవర్తనలో మార్పు రాకపోతే సూపరింటెండెంట్లపైనా చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. హాస్పిటల్ లోపల, బయట పరిశుభ్రంగా ఉంచే బాధ్యత కూడా సూపరింటెండెంట్లదేనని చెప్పారు. పేషెంట్లకు ఇచ్చే డైట్ మెనూను హాస్పిటల్‌‌‌‌లో బోర్డుల రూపంలో ప్రదర్శించాలని మంత్రి సూచించారు. 

10 నిమిషాల ముందే హాస్పిటల్‌‌‌‌కు రావాలె..
డైట్, శానిటేషన్ కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు అందాలని, కార్మికులకు కూడా టైమ్‌‌‌‌కు జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి హరీశ్‌‌‌‌ సూచించారు. పేషెంట్లకు బ్లడ్ అవసరమైతే బయటకు పంపొద్దని, ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల నుంచే బ్లడ్ ఇవ్వాలని చెప్పారు. డిశ్చార్జ్ సమయంలో డాక్టర్ రాసిన అన్ని మందులు పేషెంట్‌‌‌‌కు సరిపడా ఇవ్వాలన్నారు. టీ -డయాగ్నస్టిక్ సెంటర్లలో రిపోర్టులు ఆలస్యం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు. హాస్పిటళ్లలో రాత్రుళ్లో కూడా పోస్ట్‌‌‌‌మార్టం చేయడం ప్రారంభించాలన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని కొన్ని హాస్పిటళ్లలో డాక్టర్లు ఎక్కువ మంది, మరికొన్ని చోట్ల తక్కువ మంది ఉన్నారని, వారిని తక్కువ డాక్టర్లు ఉన్న హాస్పిటళ్లలో డిప్యుటేషన్‌‌‌‌పై పంపించాలని మంత్రి ఆదేశించారు. సూపరింటెండెంట్లు హాస్పిటల్ టైమ్‌‌‌‌ కన్నా 10 నిమిషాలు ముందే రావాలని, పది నిమిషాలు ఆలస్యంగా వెళ్లాలని ఆదేశించారు. పనిని బట్టే సీనియర్ రెసిడెంట్లకు ధృవీకరణ పత్రాలు ఇస్తామని చెప్పారు. హాస్పిటళ్లకు పేషెంట్లను తీసుకొచ్చే ఆశా వర్కర్ల కోసం ప్రత్యేకంగా విశ్రాంతి గదులు కేటాయించడంతో పాటు భోజనం పెట్టించాలని సూచించారు.