
- కాందీశీకుల భూముల కబ్జాకు మంత్రి యత్నం: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
- బీఎస్పీలో చేరిన జానయ్య భార్య, తల్లి
హైదరాబాద్, వెలుగు: నల్గొండ జిల్లా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ (డీసీఎంఎస్), బీసీ నేత వట్టే జానయ్య యాదవ్‌పై అక్రమ కేసుల వెనుక విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి హస్తం ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం పార్టీ స్టేట్ ఆఫీసులో వట్టే జానయ్య యాదవ్ భార్య రేణుక, తల్లి ఐలమ్మ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరో 500 మందితో బీఎస్పీలో చేరారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, భూ కబ్జాలు చేశారంటూ జానయ్యపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆయనేమైనా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో భూములు అడిగారా? మంత్రి జగదీశ్ రెడ్డి విద్యుత్ కొనుగోలు కుంభకోణంలో వాటా అడిగారా అని ప్రశ్నించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులను రాజకీయంగా ఎదగకుండా సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆదిపత్య వర్గాలు భూములు కబ్జా చేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతుంది.. బీసీ కులాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే నేరమవుతుందా అని ప్రశ్నించారు. యాదవుల పవిత్ర పండుగ సదర్ ఉత్సావాలు నిర్వహిస్తే మంత్రి కక్ష సాధింపు చర్యలకు దిగడం హేయమైన చర్య అని మండిపడ్డారు.
చౌటుప్పల్ పరిధిలోని దండు మల్కాపూర్‌లో రూ.600 కోట్లు విలువైన కాందీశీకుల భూములు కబ్జా వెనుక మంత్రి హస్తం ఉందని, ఆ భూములను కాపాడినందుకే నాటి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని ప్రభుత్వం బదిలీ చేసిందని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే జానయ్యపై మంత్రి ఆదేశాలతో అక్రమ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో జానయ్యను చంపించేందుకు మంత్రి కోటి రూపాయల సుపారీ చెల్లించారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కాగా, సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ నేతలు జిల్లా అధ్యక్షుడు మోహన్ సమక్షంలో బీఎస్పీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో మల్లన్న గుట్ట గుడి మాజీ చైర్మన్ సల్కం మల్లేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు. వీరికి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ కండువా కప్పి, బీఎస్పీలోకి ఆహ్వానించారు.