సూర్యాపేటలో గెలిచే దిక్కులేదు గాని మునుగోడులో తిరుగుతుండు

సూర్యాపేటలో గెలిచే దిక్కులేదు గాని మునుగోడులో తిరుగుతుండు
  • అందర్నీ ఒప్పించి నిర్ణయం 
  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

నల్గొండ జిల్లా : మంత్రి జగదీష్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో మంత్రి జగదీష్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఇన్ని నియోజకవర్గాలు ఉండగా మంత్రి మునుగోడులోనే కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేయడంలో ఉన్న అంతర్యమేంటని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ‘మంత్రికి సూర్యాపేటలో గెలిచే దిక్కు లేదు గాని మునుగోడులో తిరుగుతుండు.. దళితులు తక్కువగా ఉన్న గ్రామాలు ఎంచుకుని దొంగలాగా ప్రొటోకాల్ పాటించకుండా పంపిణి చేస్తున్నారు..’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.

పార్టీ మారే ఉద్దేశం లేదు..
తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పందించారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని.. ఒకవేళ మారాల్సి వస్తే అందరిని ఒప్పించి, సమావేశపరిచి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో మునుగోడులో పోటీ చేయాలా వద్దా అనేది అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటానన్నారు. తాను ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మునుగోడు ప్రజలకు అందుబాటులో ఉంటానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.