పాలమూరు ప్రాజెక్టు, అప్పులపై చర్చకు సిద్ధమా? : మంత్రి జూపల్లి

పాలమూరు ప్రాజెక్టు, అప్పులపై చర్చకు సిద్ధమా? : మంత్రి జూపల్లి

 

  • కేటీఆర్​కు మంత్రి జూపల్లి సవాల్
  • అబద్ధాలపై బతకడం ఆయనకు అలవాటని ఫైర్

హైదరాబాద్, వెలుగు: ‘పాలమూరు ప్రాజెక్టు, అప్పులపై చర్చకు సిద్ధమా?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​కు  మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్​ విసిరారు. పాలమూరు ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిందే రూ.30 వేల కోట్లు అని, ఇంకా రూ.40 వేల కోట్ల ఖర్చు చేస్తేనే ప్రాజెక్టు పూర్తి అవుతుందని, కెనాల్ కు అడ్మినిస్ట్రేషన్ మంజూరు లేదని.. నిధులు ఖర్చు చేయకుండా 90 శాతం ఎలా ప్రాజెక్టును పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

కృష్ణాజలాలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు. కృష్ణా నీటిలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 513 టీఎంసీలు ఒప్పుకుని నష్టం చేసింది చాలక ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అబద్ధాలపై బతకడమే కేటీఆర్​కు అలవాటని మండిపడ్డారు. సోమవారం రవీంద్రభారతిలో మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడారు. ‘‘నేను మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో? రాదోనని మాట్లాడినట్లు కేటీఆర్ చెబుతున్నారు.

 నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నడు. దానిపై నేను చర్చకు సిద్ధంగా ఉన్నా.. ఎప్పుడు.. ఎక్కడికి రావాలో డేట్, ప్లేస్ కేటీఆర్ చెప్పాలె’ అని సవాల్ విసిరారు. కేటీఆర్ తాను చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదమని జూపల్లి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మరోసారి పంజా విసురనున్నారని, అప్పుడు ఆయన సత్తా ఏంటో కేటీఆర్ కు మళ్లీ  తెలుస్తుందన్నారు.