
బషీర్బాగ్, వెలుగు: తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన త్యాగరాజ కీర్తనలకు బహుళ ప్రాచుర్యం కల్పించడానికి కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బషీర్ బాగ్ లోని ఎల్.బి ఇండోర్ స్టేడియంలో త్యాగరాజ స్వామి 258వ జయంతి మహోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా మంత్రి జూపల్లి ఉత్సవాలను ప్రారంభించారు. త్యాగరాజ విరచిత పంచరత్న కీర్తనలను వింటూ ఆయనను స్మరించుకోవడం గొప్ప అదృష్టభాగ్యమన్నారు.
తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య పుంజాల మాట్లాడుతూ.. తంజావూరు స్థాయిలో ఏటా త్యాగరాజు ఉత్సవాలు నిర్వహించాలని, సంగీత నృత్య కళాకారుల్లో ఐక్యత కోసం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి మాట్లాడుతూ.. శాస్త్రీయ సంగీతం మనసుకు ఎంతో ఉల్లాసాన్ని అందిస్తుందని, భక్తిభావాన్ని పెంపొందిస్తుందన్నారు.
తెలంగాణ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, పద్మశ్రీ డా. శోభారాజు, పద్మశ్రీ డా.యెల్లా వెంకటేశ్వరరావు, హైదరాబాద్ సిస్టర్ హరిప్రియ పాల్గొన్నారు. అనంతరం వందలాది సంగీత బృందాలు త్యాగరాజు కీర్తనలు గానం చేసి అలరించారు.