హైదరాబాద్, వెలుగు: తెలంగాణను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమం మంచి విజయం సాధించిందని తెలిపారు. రెండేళ్లుగా పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ రంగాల్లో సాధించిన పురోగతి నివేదికను శనివారం మంత్రి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టూరిజం కాన్‌క్లేవ్, గ్లోబల్ సమ్మిట్ ద్వారా మొత్తం రూ.23,741 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుసాగుతోందని తెలిపారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా ‘100 వీకెండ్ గేట్‌వే డెస్టినేషన్స్’ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని మంత్రి వివరించారు.
మౌలిక సదుపాయాలకు రూ. 470 కోట్లు..
పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం మొత్తం రూ.470 కోట్ల నిధులతో పనులు కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. కేంద్రం నుంచి రూ.181 కోట్లు మంజూరు కాగా, రామప్ప, బుద్ధవనం, సోమశిల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
