వనపర్తి/పాన్గల్/వీపనగండ్ల, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేర్చుతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం పాన్గల్, చిన్నంబావి మండలాల్లోని బండపల్లి, కొప్పునూరు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకొని గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లబ్ధిదారులు అప్పులు చేసి తిప్పలు పడవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఇండ్లు నిర్మించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు ఇచ్చి ఆదుకుందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
అర్హులైన లబ్ధిదారులందరికీ విడతల వారీగా ఇండ్లు వస్తాయని, ఎవరూ అధైర్య పడొద్దని సూచించారు. అనంతరం బండపల్లి, బహదూర్ గూడెం గ్రామాల్లో మహిళా సమైఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రైతులకు ఇబ్బంది లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. లైబ్రరీ చైర్మన్ గోవర్ధన్ సాగర్, సర్పంచులు కోమారి హుస్సేనమ్మ, మినిగి రమాదేవి, బిచ్చన్న, నాయకులు పుల్లారావు, రాము యాదవ్, ముంత భాస్కర్ పాల్గొన్నారు.
