- బతుకమ్మ ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి జూపల్లి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యానికి, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ విశిష్టతను విశ్వవ్యాప్తంగా చాటేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నేటి నుంచి 18వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ సంబురాలను వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం హైటెక్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బతుకమ్మ వేడుకల పోస్టర్‌ను మంత్రి జూపల్లి ఆవిష్కరించి, మాట్లాడారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటే ఇలాంటి పండుగలను నిర్వహించడం ద్వారా రాష్ట్ర సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు ప్రపంచానికి తెలంగాణ ప్రత్యేకతను పరిచయం చేయవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు మంత్రి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ గ్లోబల్ సమిట్..
తెలంగాణ పర్యాటక రంగాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు ట్రావెల్ టూరిజం ఫెయిర్ వంటి వేదికలు దోహదపడతాయని మంత్రి జూపల్లి అన్నారు. పర్యాటక సంస్థలు, ట్రావెల్ కంపెనీలు, ఆతిథ్య రంగ సంస్థలు, పర్యాటక పరిశ్రమ ప్రతినిధులు ఒకే వేదికపైకి రావడం ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు, భాగస్వామ్యాలు, ఉపాధి మార్గాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన 24వ ట్రావెల్ టూరిజం ఫెయిర్-2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఈ ప్రదర్శన ద్వారా దేశీయ, అంతర్జాతీయ పర్యాటక రంగ కొనుగోలుదారులు, సేవలందించే సంస్థల మధ్య అనుసంధానం పెరిగి, కొత్త భాగస్వామ్యాలు, మార్కెట్ విస్తరణకు అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
