ప్రజాకర్షక స్కీంలు కాదు.. అభివృద్ధి, సంక్షేమానికే పెద్దపీట : కిషన్ రెడ్డి

ప్రజాకర్షక స్కీంలు కాదు.. అభివృద్ధి, సంక్షేమానికే పెద్దపీట :  కిషన్ రెడ్డి
  • మధ్యంతర బడ్జెట్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • వికసిత్  భారత్  లక్ష్యాలకు రాచబాట వేస్తున్నామని కామెంట్

న్యూఢిల్లీ, వెలుగు : ప్రజాకర్షక పథకాలు కాకుండా దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోదీ సర్కార్  మధ్యంతర బడ్జెట్ ను రూపొందించిందని కేంద్ర మంత్రి కిషన్  రెడ్డి అన్నారు. వికసిత్  భారత్  లక్ష్యాలను ఈ బడ్జెట్ ప్రతిబింబించిందన్నారు. అమృత్ కాల్ (వచ్చే 25 ఏండ్లలో) లో దేశం సాధించాల్సిన ప్రగతిని నిర్దేశించుకుని వాటిని చేరుకునేందుకు ఏయే రంగాల్లో దృష్టి సారించాలో తెలియజేసేలా ఈ బడ్జెట్  రూపకల్పన జరిగిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ పై గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

మౌలిక వసతుల రంగంపై చేయాల్సిన వ్యయాన్ని రూ. 11.11 లక్షల కోట్లకు (11 శాతం పెంపు) కేంద్రం పెంచిందన్నారు. సోలార్  విద్యుత్ (పునరుత్పాదక విద్యుత్) వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఇళ్ల పైకప్పులపై సోలార్  ప్యానెళ్లను ఏర్పాటు చేసే ప్రక్రియకు ఈ బడ్జెట్ లో శ్రీకారం చుట్టామని చెప్పారు. అలాగే పేదలు, మధ్యతరగతి వర్గాలకు మద్దతుగా వారి సొంతింటి కలను సాకారం చేసేందుకు రుణ సదుపాయం కల్పించామని తెలిపారు.

కేంద్ర బడ్జెట్ లో మహిళా సాధికారత, పన్నుల సంస్కరణలు, అంగన్‌‌వాడీ– ఆశా వర్కర్ల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు. పర్యాటకానికి ఊతం ఇచ్చేలా అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్, మార్కెటింగ్  చేయడంపైనా ఈ బడ్జెట్ లో ప్రాధాన్యం కల్పించామన్నారు.