తెలంగాణ రాష్ట్రంలో కన్‌‌స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తం : కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కన్‌‌స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తం : కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి
  •     ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ డెవలప్‌‌ సెంటర్స్ పెడతాం : వెంకట్‌‌ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కన్‌‌స్ట్రక్షన్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, ఈ అం శంపై సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతానని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పా టు చేస్తామని హామీ ఇచ్చి, నెరవేర్చలేదన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌ మాదాపూర్‌‌‌‌లో జరిగిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌‌స్ట్రక్షన్ (న్యాక్) 45వ ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌‌లో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వం పేపర్లలో ఫొటోలు, టీవీల్లో స్టేట్‌‌మెంట్లు తప్పితే ఎక్కడా నిజాల్ని వెల్లడించలేదని విమర్శించారు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసి, లక్షల మంది యువత జీవితాలతో ఆడుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ నాయకులు పెట్టుబడుల పేరిట మీడియా ప్రచారం తప్ప.. ఒక్కటీ కార్యరూపం దాల్చలేదని ఆరోపించారు. దుబాయ్‌‌కు చెందిన నాఫ్కో కంపెనీ న్యాక్‌‌తో ఎంవోయూ చేసుకొని ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేస్తుందని గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందని, అయితే, అసలు ఆ కంపెనీ ఊసేలేదని న్యాక్ సిబ్బంది చెప్పడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఏటా కనీసం 4 సార్లు జరపాల్సిన న్యాక్ గవర్నింగ్ బాడీ సమావేశాలను 10 ఏండ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే జరపడం బాధాకరమన్నారు. 

నిరుద్యోగులకు టీసీఎస్‌‌ ద్వారా ట్రైనింగ్‌‌..

రాబోయే రోజుల్లో 9 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మండలాల వారిగా నిరుద్యోగులకి స్కిల్ డెవలప్‌‌మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి వెంకట్‌‌ రెడ్డి తెలిపారు. ప్రతి ఉమ్మడి జిల్లాలో 10 వేల మంది నిరుద్యోగులకు టీసీఎస్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. న్యాక్‌‌కు సంబంధించిన భూములను పొందిన కొన్ని సంస్థలు కమర్షియల్ కార్యకలపాలకు వినియోగిస్తూ న్యాక్ ఆదాయానికి గండి కొడుతున్నాయని, వాటిని సరిచేస్తామని తెలిపారు.