ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రూవ్ అయితే.. కేటీఆర్‌‌కు పదేండ్ల జైలు

ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రూవ్ అయితే.. కేటీఆర్‌‌కు పదేండ్ల జైలు
  • ఆయన వ్యాఖ్యలపై సుమోటోగా కేసు పెట్టాలి: మంత్రి వెంకట్​రెడ్డి
  • కేసీఆర్ అవినీతిని బయటకు తీసేందుకే 20 ఏండ్లు పడుతది
  • లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ అని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రూవ్ అయితే కేటీఆర్‌‌కు పదేండ్ల జైలు శిక్ష పడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయనే ఒప్పుకున్నారని, అతని వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు బుక్ చేయాలని ఆయన పేర్కొన్నారు. కాశీం రిజ్వీ కంటే డేంజర్‌‌ మనుషులను కేసీఆర్ తయారు చేసిండని, వాళ్లే ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్లని వెంకట్​రెడ్డి అన్నారు.లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎక్కడా పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మినిస్టర్స్‌‌ క్వార్టర్స్​లో మీడియాతో చిట్‌‌ చాట్‌‌ చేశారు. ‘‘బీఆర్‌‌ఎస్ సర్కారు బిల్లులు ఆపడం వల్ల అప్పులపాలైన కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకుంటామని మెసేజ్‌‌లు పెడుతున్నారు.  దళితబంధు పెట్టి వారినీ దోచుకున్నరు. సీఎంఆర్‌‌ఎఫ్‌‌లో స్కామ్ చేశారు. కేసీఆర్‌‌  ఫామ్‌‌హౌజ్‌‌కు పోవడానికి వాసాలమర్రి గ్రామాన్ని నాశనం చేశారు. గొర్ల స్కీమ్‌‌, టానిక్‌‌ లిక్కర్ స్కామ్‌‌లో వేల కోట్లు దోచుకున్నరు. టానిక్‌‌ తో సంతోష్‌‌ మస్తు సంపాదించిండు. వీటన్నింటిపై ఎంక్వైరీ చేయడానికి మాకు 20 ఏండ్లు పట్టేలా ఉంది” అని మంత్రి అన్నారు. హైటెక్స్‌‌లో ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులను పదేండ్ల నుంచి వసూలు చేయలేదన్నారు. 

సెక్రటేరియట్‌‌లో ఐటీకి సంబంధించిన కాంట్రాక్ట్​ను కేటీఆర్‌‌, ఆయన బావమరిదికి ఇచ్చాడని, దాని మీద ఎంక్వైరీ చేపిస్తున్నామని తెలిపారు. ‘‘ఇంటింటికీ ఇంటర్నెట్ అని రూ.5 వేల కోట్లు దోచుకున్నరు. వీళ్ల స్కాముల్లో ఉన్నోళ్లందరినీ అరెస్ట్ చేస్తే జైళ్లు కూడా సరిపోవు. కాంగ్రెస్ కరువు తెచ్చిందని బుద్ధిలేకుండా హరీశ్ మాట్లాడుతుండు. కేసీఆర్ పదేండ్ల పాపాల వల్ల ఇప్పుడు వానలు పడ్తలేవు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు నియోజకవర్గాల్లో పదేండ్లలో‌‌ చేసిన ఖర్చు.. రాష్ట్రం మొత్తం మీద కూడా చేయలేదు. కేసీఆర్ ఫ్యామిలీ ఓడినందుకు హ్యాపీగా ఉంది. ప్రగతిభవన్‌‌లో ఒక్కో పేయింటింగ్ రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లు ఉంది. నిజాంను మించిన లగ్జరీని కేసీఆర్ అనుభవించారు. చేసిన స్కామ్‌‌లకు కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం జైలుకు పోతుందని బీఆర్‌‌ఎస్ నాయకులే చెప్తున్నారు”అని వెంకట్​రెడ్డి అన్నారు.

మా గేట్లు పగులగొట్టి బీఆర్‌‌ఎస్ నుంచి వస్తున్నరు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 30 మంది కాంగ్రెస్ పార్టీతో టచ్‌‌లో ఉన్నారని వెంకట్‌‌రెడ్డి చెప్పారు. తమ ఆఫీసు గేట్లు పగులగొట్టి వస్తున్నారన్నారు‌‌‌‌. ‘రేవంత్ బీజేపీలోకి పోతాడని హరీశ్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నడు. ఎంపీ ఎన్నికల తర్వాత ఆయనే బీజేపీలోకి పోతడు’  అని వెంకట్​రెడ్డి తెలిపారు. బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే జగదీశ్‌‌ రెడ్డి మూడు మర్డర్లలో ఇన్‌‌వాల్వ్ అయిండని ఆరోపించారు.  కాగా, తమ అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు లేవని మంత్రి స్పష్టం చేశారు. భువనగిరి, నల్గొండలో కాంగ్రెస్‌‌కు అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేందుకు పని చేస్తున్నామని స్పష్టం చేశారు.