హైదరాబాద్: కేసీఆర్ ఫ్యామిలీపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ముందు వాళ్ల ఇంట్లో పంచాయతీ తేల్చుకోవాలని సూచించారు. హరీష్ రావు కాళేశ్వరం దొంగ అని స్వయంగా కేసీఆర్ కూతురు కవిత అన్నారని గుర్తు చేశారు. పదేళ్ల దొర పాలనలో విసుగు చెందే తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారన్నారు.
బుధవారం (జనవరి 21) శామీర్ పేటలో అలియాబాద్, మూడు చింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీల సమన్వయ సమావేశం జరిగింది. మంత్రి కోమటిరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో అన్నిచోట్ల అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమని.. లేకపోతే ఏ సవాల్కైనా సిద్దమన్నారు. కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తన ఫామ్ హౌస్కు నాలుగు దిక్కుల వేయి కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ముతో రోడ్లు వేయించుకున్నారని ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారని గుర్తు చేశారు. కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానాన్ని కూడా గెలుపించుకోలేదని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువ మంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ జీతభత్యాలు తీసుకుంటూ ఫామ్ హౌస్లో పడకుంటున్నాడని విమర్శించారు. మల్కాజిగిరి పార్లమెంటు ఇంచార్జీగా సెగ్మెంట్లోని మూడు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు.
