ట్రిపుల్ ఆర్ పనులు త్వరగా చేపట్టాలి..ఎన్ హెచ్ ఏఐ చైర్మన్‌ సంతోష్ కుమార్ ను కోరిన మంత్రి కోమటిరెడ్డి

 ట్రిపుల్ ఆర్ పనులు త్వరగా చేపట్టాలి..ఎన్ హెచ్ ఏఐ చైర్మన్‌ సంతోష్ కుమార్ ను కోరిన మంత్రి కోమటిరెడ్డి
  • పలు నేషనల్​ హైవే ప్రాజెక్ట్స్ పై చర్చ

హైదరాబాద్, వెలుగు: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్​హెచ్ఏఐ) చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌తో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులు, ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్​) పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. నిత్యం ప్రమాదాలతో 'డెత్ రోడ్'గా మారుతున్న హైదరాబాద్ - విజయవాడ (ఎన్​హెచ్​65) రహదారిపై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ప్రయాణికుల రక్షణ దృష్ట్యా ఈ రహదారిని ఎనిమిది లైన్లుగా విస్తరించే పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ఎన్​హెచ్​ఏఐ చైర్మన్‌ను కోరారు. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్​)ను ఇప్పటికే కేంద్ర ఉపరితల రవాణా శాఖ (మోర్త్​) కార్యాలయానికి పంపినట్లు ఆయన గుర్తుచేశారు.

నాగపూర్ తరహాలో చేపట్టబోయే ఈ ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్​హెచ్​ఏఐ చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం, హైదరాబాద్‌ - విజయవాడ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి టెండర్ ప్రక్రియ తుది దశలో ఉందని, త్వరలోనే పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రికి వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వెంట రోడ్లు భవనాల శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి ప్రావిణ్య, సీఈలు ధర్మారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.