నల్గొండ, వెలుగు: మతసామరస్యానికి మారుపేరుగా నిలిచిన నల్గొండ జిల్లాలో మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.రంజాన్ సందర్భంగా సోమవారం ఆయన పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద మదీనా మసీదులో ఇఫ్తార్ కు హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి గతం నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు అయ్యాయని, అలాగే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో పేద మైనార్టీ మహిళలకు టైలరింగ్ లో శిక్షణ ఇవ్వడమే కాకుండా, 150 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.
రాబోయే మూడు సంవత్సరాలలో నిరుపేద ముస్లింలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని, ముస్లిం మైనార్టీలకు ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు.ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆఫీజ్ ఖాన్, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు
