బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తం

బోనాల పండుగను  ఘనంగా నిర్వహిస్తం
  • ఆషాఢ బోనాల ఉత్సవాలకు 20 కోట్లు రిలీజ్: మంత్రి సురేఖ
  • మంత్రి పొన్నంతో కలిసి ఆలయ కమిటీలకు చెక్కులు అందజేత 
  • వేడుకల క్యాలెండర్,  పోస్టర్, పాటల సీడీ ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు:ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహిస్తామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. గతేడాది కంటే ఈ ఏడాది బోనాల పండుగను ఘనంగా నిర్వహించేదుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువ నిధులు కేటాయించిందని ఆమె తెలిపారు. శనివారం బేగంపేట హరిత టూరిజం ప్లాజాలో బోనాల ఉత్సవాలు–-2024 ఏర్పాట్లపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్​చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా బోనాల పండుగ నిర్వహణకు ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 20 కోట్ల రూపాయల చెక్కులను ఆయా దేవాలయాల కమిటీలకు అందజేశారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించేందుకు జూన్ 15 నుంచి పలు దఫాలు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో పాటు దేవాలయాల, పీస్ కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించామని  తెలిపారు. అలాగే, జులై 7 నుంచి ఆగస్టు 4 వరకు నిర్వహించే ఆషాఢ మాస బోనాలు ఏ దేవాలయంలో ఏ రోజు నిర్వహిస్తారనే వివరాలతో కూడిన పాంప్లెట్స్​ను వాట్సాప్, ఇతర మార్గాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని కమిటీ సభ్యులకు మంత్రి సురేఖ సూచించారు.

సంస్కృతీ సంప్రదాయాలను దేశవ్యాప్తం చేసేలా ఉత్సవాలు: మంత్రి పొన్నం​

హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలను దేశవ్యాప్తం చేసేలా ఉత్సవాలను నిర్వహించాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, తాను, రంగారెడ్డి జిల్లా ఇన్​చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు అధికారులను, స్థానిక దేవాలయాల కమిటీలను భాగస్వామ్యం చేసుకుంటూ ఉత్సవాలు విజయవంతం అయ్యేలా చూస్తున్నామని తెలిపారు.

ప్రజలంతా సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. అనంతరం బోనాల ఉత్సవ క్యాలెండర్( కాఫీ టేబుల్ బుక్), ఈవెంట్ క్యాలెండర్, ఉత్సవాల పోస్టర్, బోనాల పండుగ పై మామిడి హరికృష్ణ రాసిన పుస్తకం, పాటల సీడీని మంత్రులు సురేఖ, పొన్నం ఆవిష్కరించారు.