వరంగల్, వెలుగు: ‘‘నా చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు పాసైతే మా నాన్న వాచ్ కొనిస్తానని చెప్పారు. ఫస్ట్ క్లాసులో పాసయ్యా. వాచ్ బహుమతిగా అందుకున్నా. మంత్రిగా బిజీగా ఉంటూనే ఇటీవల చెన్నై యూనివర్సిటీ ద్వారా ఎంబీఏ పట్టా పొందా. ఇంకా డాక్టరేట్ కూడా చేయాలని కోరిక ఉంది' అంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చదువుపై తనకున్న మమకారాన్ని పిల్లలతో పంచుకున్నారు.
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన సోమవారం వరంగల్ హంటర్‍రోడ్‍లోని ఓ ఫంక్షన్‍హాల్‍లో ఇటీవల పది, ఇంటర్మీడియేట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన యంగ్ అచీవర్స్కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పదో తరగతిలో 550, ఇంటర్‍లో 980 మార్కులు సాధించిన స్టూడెంట్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‍రెడ్డి ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో మారుమూల గ్రామాల్లోని స్కూళ్లలో సౌకర్యాల పెంపుపై దృష్టి పెట్టారన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ విద్యార్థులు పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవాలని, సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే చదువులపై ఫోకస్ పెరుగుతుందని సూచించారు.
కాగా, అతి చిన్న వయసులో ఎమర్జింగ్ చెస్ ఛాంపియన్‍షిప్‍లో రెండు ప్రపంచ రికార్డులు సాధించిన కొండా శ్రీయాన్స్మురళీకృష్ణ పటేల్‍ను మంత్రి కొండా సురేఖ, ఎంపీ కావ్య, కలెక్టర్ సత్యశారద అభినందించారు. కాగా, యంగ్ అచీవర్స్సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ రెగ్యూలర్ భోజనంతో పాటు నిర్వాహకులు ప్రత్యేకంగా బిర్యానీ ఏర్పాటు చేశారు. దీనిపై కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ టెన్త్, ఇంటర్ పరీక్షలకు ముందు తాను పాఠశాలలు, కాలేజీలను సందర్శించానని చెప్పారు. ఈ సందర్భంగా ఫస్ట్ క్లాస్లో పాసైనవారికి బిర్యానీ పార్టీ ఇస్తానని మాటిచ్చానని, ఆ మాట ప్రకారం పిల్లలందరికీ బిర్యానీ పార్టీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అందరితో కలిసి కలెక్టర్ భోజనం చేశారు.
