హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతో పాటు పచ్చదనం పెంచడమే లక్ష్యంగా అటవీశాఖ యంత్రాంగం పనిచేయాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. రాష్ట్ర అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారి (పీసీసీఎఫ్)గా బాధ్యతలు స్వీకరించిన వినయ్ కుమార్ శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినయ్ కుమార్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపి, శాఖాపరమైన అంశాలపై దిశానిర్దేశం చేశారు.
అటవీ విస్తీర్ణం పెంపు, జీవ వైవిధ్య సంరక్షణ, వన మహోత్సవం వంటి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. అటవీ రక్షణలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని, క్షేత్రస్థాయిలో సిబ్బందిని సమన్వయం చేస్తూ అడవుల అభివృద్ధి కృషి చేయాలని సూచించారు. అడవుల రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వార్షిక అవార్డులు, నగదు ప్రోత్సాహకాలు ప్రకటించడం పట్ల పీసీసీఎఫ్ వినయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.
మంత్రి సురేఖ ప్రత్యేక చొరవతోనే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయని, ఇది సిబ్బందిలో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పదవీ విరమణ చేసిన మాజీ పీసీసీఎఫ్ సువర్ణ సైతం మంత్రిని కలిశారు. అటవీ శాఖకు ఆమె చేసిన సేవలను మంత్రి కొండా సురేఖ గుర్తు చేసుకున్నారు. సువర్ణను చీరతో సత్కరించి, ఆమె సేవలను కొనియాడారు.
