ఎమ్మెల్సీ కవితకు మంత్రి కొండా సురేఖ కౌంటర్​

ఎమ్మెల్సీ కవితకు మంత్రి కొండా సురేఖ కౌంటర్​

వరంగల్‍, వెలుగు: బీసీల మీద బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితకు ఇంత ప్రేమ పదేండ్ల తర్వాత ఇప్పుడే ఎందుకు వచ్చిందని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. ‘‘పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? బీసీల గురించి, ఫూలే విగ్రహం గురించి అప్పుడెందుకు మాట్లాడలేదు? లైమ్​లైట్​లో ఉండటానికి కొన్నిరోజులు బతుకమ్మ అని, కొన్నిరోజులు జాగృతి అని కవిత జనం ముందుకు వచ్చింది. ఇప్పుడు మళ్లీ లైమ్​లైట్​లో ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నది” అని అన్నారు. శనివారం వరంగల్​లో మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడారు. ఇంద్రవెల్లి సభ పేరిట సీఎం రేవంత్‍రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ కవిత చేసిన కామెంట్లకు కౌంటర్​ ఇచ్చారు. ‘‘ప్రభుత్వ సొమ్ము గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ప్రజాధనాన్ని దోచుకున్నరు. వంద కోట్లు పెట్టి సొంత ఫ్లైట్​ కొనుకునే స్థాయికి మీరెట్ల ఎదిగిన్రు?” అని కవితను నిలదీశారు. 

అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి ఇండ్లివ్వడానికి ఇంద్రవెళ్లి వెళ్లారని, అది అఫీషియల్‍ ప్రోగ్రామ్ అని చెప్పారు. ‘‘కేసీఆర్‍ ఫ్యామిలీ తెలంగాణ సెంటిమెంట్‍ను అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయల జనం సొమ్మును దోచుకుతిన్నది. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. ఎమ్మెల్సీ కవిత లిక్కర్‍ రాణిగా దేశంలో పేరు తెచ్చుకున్నది. లిక్కర్‍ కేసులో అరెస్ట్​ కాకుండా బీజేపోళ్ల కాళ్లుమొక్కిన్రు.. కవిత అరెస్టు కాకుండా బీఆర్​ఎస్​, బీజేపీ మధ్య అండర్​స్టాండింగ్​ కుదిరింది” అని  అన్నారు.  అధికారం దూరమవడంతో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం లైమ్​ లైట్‍లో ఉండేందుకు కవిత ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రియాంకగాంధీ వస్తే నిరసన తెలుపుతామన్న కవిత కామెంట్లకు స్పందిస్తూ... ‘‘అమ్మాతల్లీ.. భద్రాద్రి శ్రీరాముడికి మీ అన్న కొడుకు ఏ హోదాలో పట్టువస్త్రాలు తీసుకెళ్లాడో చెప్పు” అని మంత్రి సురేఖ నిలదీశారు.

దమ్ముంటే మళ్లీ ఎంపీగా పోటీ చెయ్‍ 

కవితకు దమ్ముంటే మరోసారి ఎంపీగా పోటీ చేయాలని మంత్రి కొండా సురేఖ సవాల్‍ విసిరారు. ‘‘అమ్మా.. మళ్లీ నిజామాబాద్‍ నుంచి నిలబడు. లేదంటే వేరేచోటి నుంచి నిలబడు. తెలంగాణ ప్రజలు నిన్ను చిత్తుగా ఓడగొడతరు” అని అన్నారు. తొమ్మిదిన్నరేండ్లు అధికారంలో ఉన్నన్ని రోజులు గుర్తుకు రాని బీసీలు ఇప్పుడు కవితకు గుర్తుకు రావడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘ముందు మీ అన్న కేటీఆర్​ను బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ నుంచి దింపి బీసీకి ఆ సీటు ఇవ్వున్రు. బీసీలపై, పూలేపై ప్రేమ ఉంటే ఇది చెయ్యున్రి” అని కవితకు మంత్రి సురేఖ హితవు పలికారు.  ప్రజా ప్రభుత్వంపై ఇష్టమున్నట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.